వైఎస్ జగన్మోహనరెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ముహూర్తాల సీజన్ ముగిసిపోయిందని కూడా నేతలు పట్టించుకోవడం లేదు. ఎవరికి వారు యథేచ్ఛగా తెలుగుదేశంలోకి జంప్ చేసేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏకంగా పార్టీ అధినేత వైఖరి మీదనే ఆరోపణలు గుప్పిస్తూ వెళ్లిపోతుండడం విశేషం. ఇన్నాళ్లూ ఎమ్మెల్యేల వలసల పర్వం జోరుగా సాగగా, ఇప్పుడు అదే స్థాయిలోని ఇతర నేతల వలసలకు తెదేపా శ్రీకారం చుడుతున్నట్లుంది. వెస్ట్ గోదావరి జిల్లా వైకాపా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బరాయుడు కూడా త్వరలోనే తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జిల్లాలో వైకాపాకు బలమైన నాయకుడుగా ఉన్న కొత్తపల్లి కూడా వెళ్లిపోవడం ఒక రకంగా గోదావరి జిల్లాల్లో బలోపేతం కావాలనుకుంటున్న జగన్‌కు దెబ్బే అని చెప్పాలి.
నాయకుల మధ్య అంతర్గత విభేదాల వలన ఎవరైనా పార్టీనుంచి వెళ్లిపోతూ ఉంటే గనుక.. పార్టీ అధినేత వారికి సర్ది చెప్పవచ్చు. కానీ.. వైకాపానుంచి వెళ్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఏకంగా అధినేత జగన్ మీదనే ఆరోపణలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం. జగన్ వైఖరి నచ్చకనే కొత్తపల్లి సుబ్బరాయుడు కూడా పార్టీ మారుతున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ఆయన కార్యకర్తలతో చర్చలు కూడా ప్రారంభించారుట.
ఏకబిగిన అనేక మంది నాయకులు ఫిరాయిస్తూ జగన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారన్నమాట వాస్తవం. పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, వారు జారిపోకుండా చూసుకోవడం మీద జగన్ కాన్సంట్రేట్ చేస్తోంటే.. ఎమ్మెల్యేలు కాని ఇతర కీలక నేతలు వెళ్లిపోవడం జరుగుతోంది.
కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన కాంగ్రెసు పార్టీ మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. తమ పార్టీలోకి కూడా ఎవరో ఒకరు కొత్తగా వస్తున్నారని జగన్ మురిసిపోయేలోగానే.. కొత్తపల్లిసుబ్బరాయుడు తెదేపాలోకి వెళ్తున్నారనే కబురు ఆయనకు నిజంగానే పెద్ద షాక్ కావచ్చు. కొత్తపల్లి చేరికతో కులాల పరంగా కూడా తెలుగుదేశం గోదావరి జిల్లాల్లో మరింత బలోపేతం అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.