నిన్నటి వరకు కొన్ని సందేహాలు ఉన్నాయి. కేంద్రం ప్రత్యేకహోదాను ఇస్తుందో లేదో అనే మీమాంస ఉండేది. ఇస్తారేమో.. ఈలోగా తొందరపడి మనం ఒక నింద వేయడం ఎందుకు? అనే వెరపు ఉండేది. కానీ ఇప్పుడు కేంద్రం చాలా స్పష్టత ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హోదా కుదరదు అంటూ సభాముఖంగా తేల్చేసింది. అయినా సరే.. కేంద్రంతో సానుకూల వైఖరిని మాత్రమే కొనసాగించాలనే చంద్రబాబునాయుడు వైఖరిలో మాత్రం ఇసుమంతైనా మార్పు రావడం లేదు. ‘సామరస్యంగానే నిధులు సాధించుకుందాం.. కేంద్రం సహకారం మనకు చాలా అవసరం’ అనే పాచిపాటనే ఆయన ఇప్పటికీ పాడుతున్నారు. ‘తన సామరస్య పోరాటం అంటే కేంద్రానికి చులకన భావం ఏర్పడిందని, ప్రజలు ఈసడించుకుంటున్నారని’ కూడా చంద్రబాబు అర్థం చేసుకోవడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో తాము చేయదలచుకున్న మోసాన్ని కేంద్రం బట్టబయలు చేసిన తర్వాత.. కేంద్రంతో పోరాడి అయినా సాధించుకోవాలన్నదే రాష్ట్ర ప్రజల మనోగతంగా ఉన్నది. ఈ విషయంలో చంద్రబాబునాయుడు మాత్రం తొలినుంచి కేంద్రంతో సామరస్యంగానే సాధించుకోవాలనే సూత్రాన్ని వల్లె వేస్తున్నారు. ఆ పద్ధతిలో పోవడం వల్ల రెండేళ్లలో ఆయన ఏం సాధించారో చెప్పడానికి ఆయనకు ధైర్యం ఉన్నదో లేదో తెలియడం లేదు.
తాజాగా కేంద్రం వైఖరి తేలిపోయాక తెదేపా పరువు పోకుండా ఈ విషయంలో ఎలా స్పందించాలో నిర్ణయించడానికి చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గ సహచరులు, ఇతర కీలక నేతలందరితో ఆదివారం విజయవాడలో ఓ సమావేశం నిర్వహించుకున్నారు. అందరూ కలిసి తన పాత పాచిపాటే పాడేలా చంద్రబాబు వారిని ట్యూన్ చేసేశారు. కేంద్రంతో సామరస్యంగానే సాధించుకోవాలని అందరూ నిర్ణయించారు. కేంద్రంనుంచి వైదొలగ రాదని, దానివలన రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం అని తీర్మానించారు.
చంద్రబాబునాయుడు తాను ఒక అడుగు తగ్గానని, ఏ సీఎం వెళ్లనంతగా.. 22సార్లు ఢిల్లీ వెళ్లానని పదేపదే చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. అంతిమంగా రాష్ట్రం కోసం ఏం సాధించారు? అన్నది ఒక్కటే ప్రజలకు అవసరం. చంద్రబాబు చెబుతున్నట్లుగా కేంద్రంనుంచి తెదేపా మంత్రులు వైదొలగాలన్నది కేవలం రాజకీయ డిమాండు మాత్రమే కావచ్చు. వైదొలగడం వలన సాధించేది ఏమీ లేదని ప్రజలు కూడా బాబు మాటను నమ్ముతారు. తెదేపా మంత్రుల్ని తప్పించాలనేది ప్రజల కోరిక కాదు. కాకపోతే, ‘సామరస్య ధోరణి’ అనే మాయమాటల రూపేణా కూడా ఒరుగుతున్నది ఏమీ లేదని వారి బాధ. ఈ విషయంలో ప్రజలకు నిర్దిష్టమైన సమాధానం చంద్రబాబు చెప్పగలరో లేదో ఆలోచించుకోవాలి.