ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల బరిలో అధికార తెరాస, వారితో ప్రధానంగా తలపడుతున్న విపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు రిపీట్ అవుతున్నాయి. గతంలో ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీలు ఏ రకంగా అయితే మాటల కత్తులు దూసుకున్నారో.. ఇప్పుడు కూడా అచ్చంగా అదే తీరులో స్పందిస్తున్నారు. ఒక రకంగా చూసినప్పుడు పాలేరులో కూడా గతంలో మాదిరిగానే రిజల్టు కూడా రిపీట్ అవుతుందా? అనే సందేహం కూడా కలుగుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించిన నేపథ్యంలో ఆ స్థానాన్ని తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీకే దక్కించుకోవాలని కాంగ్రెస్ చాలా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైకాపా, తెదేపాలను కూడా బతిమాలి, వారి పోటీ లేకుండా చేసుకున్న కాంగ్రెస్ తెరాసనుంచి గట్టిపోటీనే ఎదుర్కొంటున్నది. కాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మోహరించడం ద్వారా గెలుపు ఖరారు అనే పరిస్థితిని సృష్టించుకున్న తెరాస.. ప్రచారంలో దూకుడుగానే ఉన్నది.
తాజాగా పాలేరు ఉప ఎన్నికలో పార్టీ ఓడితే గనుక తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, అదే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా? అని కేటీఆర్ ఒక సవాలు విసిరారు. తెరాస తరఫున పాలేరు ఉప ఎన్నిక ఇన్చార్జి బాధ్యతలు తనే చూస్తున్నారు గనుక.. ఆయన చేసిన సవాలు సబబుగానే ఉంది. అయితే ఈ సవాలును స్వీకరించడానికి కాంగ్రెస్ వారికి ధైర్యం చాలినట్లు లేదు. ఉత్తంకుమార్‌రెడ్డి కాస్త డొంకతిరుగుడుగా.. ‘కేటీఆర్ ఒక బచ్చా.. తండ్రి కేసీఆర్ గనుక పాలేరు ఓటమితో తన పదవికి రాజీనామా చేస్తానని అంటే గనుక.. ఆ సవాలును స్వీకరిస్తాం’ అని కౌంటర్ ఇస్తున్నారు.
అటు కేటీఆర్ సవాలు, ఉత్తం ప్రతిసవాళ్లు రెండూ పాతవే. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా అచ్చంగా ఇవే సవాళ్లు వినిపించాయి. బల్దియా పీఠం మీద గులాబీ జెండా ఎగిరే విషయంలో తన రాజీనామాకు కేటీఆర్ సవాలు చేస్తే.. నువ్వు కాదు మీ నాన్న ను చేయమను అంటూ ఉత్తంకుమార్‌రెడ్డి స్పందించారు. తీరా ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి సవాలును స్వీకరించడానికి ధైర్యం చాలకపోయిన సందర్భాల్లో.. కేసీఆర్‌ను సవాలుకు రమ్మను అని నెపం పెట్టి పలాయనం చిత్తగిస్తున్నదని ప్రజలు అనుకుంటున్నారు.