కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మురళీ కృష్ణ నిన్న వైకాపాలో చేరారు. ఆయన 2009లో కర్నూలు జిల్లా కోడుమూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి అప్పటి తెదేపా అభ్యర్ధి మణి గాంధిపై గెలిచారు. 2014 ఎన్నికలలో పొత్తులలో భాగంగా ఆ స్థానాన్ని భాజపాకి కేటాయించవలసి రాడంతో మణి గాంధికి తెదేపా టికెట్ ఇవ్వలేకపోయింది. ఆయన తెదేపాకు గుడ్ బై చెప్పేసి వైకాపాలో చేరి, భాజపా, కాంగ్రెస్ అభ్యర్ధులను చిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకొన్నారు. కొన్ని రోజుల క్రితమే మణి గాంధి మళ్ళీ తెదేపాలోకి వెళ్ళిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ క్షీణిస్తుండటం, తన రాజకీయ ప్రత్యర్ధి మణి గాంధి వైకాపాని వీడి తెదేపాలోకి వెళ్ళిపోవడంతో మురళి కృష్ణ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నిన్న వైకాపాలో చేరారు.
వైకాపా ఎమ్మెల్యేలు అందరూ తెదేపాలోకి వెళ్లిపోతుంటే వారిని ఆపలేక, ఉన్నవారిని కాపాడుకోలేక సతమతమవుతున్న జగన్మోహన్ రెడ్డికి మురళీ కృష్ణ చేరిక చిన్న ఉపశమనం కలిగించవచ్చు. తెదేపా, దాని అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా వైకాపా మూతపడే పరిస్థితి ఏమీ లేదని, రాష్ట్రంలో తెదేపా, కాంగ్రెస్, భాజపాలకు తమ పార్టీయే ఏకైక ప్రత్యమ్నాయమని రాజకీయ నేతలు నమ్ముతున్నారని ఇది రుజువు చేస్తోందని చెప్పుకొనే అవకాశం కల్పించింది. కానీ నేటికీ కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి సీనియర్లు పార్టీని వీడిపోవడం చాలా ఆందోళన కలిగిస్తోనే ఉంటుంది.