పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడులు జరిగి ఇప్పటికి ఐదు నెలలయ్యింది. ప్రపంచ దేశాల ఒత్తిళ్లకు తలొగ్గి ఆ దాడులకు కుట్రపన్నిన వారిని పట్టుకొంటామని మొదట్లో చెప్పిన పాక్, ఆ తరువాత దానితో తమకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం మొదలుపెట్టింది. పఠాన్ కోట్ పై దాడులకు పాల్పడిన నలుగురు పాక్ ఉగ్రవాదులు భద్రతా దళాల చేతిలో హతమయిన సంగతి తెలిసిందే. వారి చివరి ఫోన్ సంభాషణలు, ఇతర ఆధారాల సహాయంతో వారిలో నసీర్ పాకిస్తాన్ లోని పంజాబ్ జిల్లాలోని వెహరి, అబూ బకర్ అదే జిల్లాలోని గుజ్రాన్ వాలా, ఫరూక్ సింద్ లో సంఘర్, కయూం అనే ఉగ్రవాది సింద్ లోని సుక్కుర్ అనే ప్రాంతాలకి చెందినవారిగా భారత్ నిఘా సంస్థలు గుర్తించాయి. వారి శవాలను స్వాధీనం చేసుకొని వారి కుటుంబాలకు అప్పగించవలసిందిగా కోరుతూ భారత విదేశాంగ శాఖ వ్రాసిన లేఖకు జవాబుగా, “భారత్ అందించిన ఆ ఆధారాల ప్రకారం దర్యాప్తు చేయగా అటువంటి పేరుగల వారెవరూ ఆ ప్రాంతాలలో ఉన్నట్లు కనుగొనలేదని, కనుక వారు పాకిస్తాన్ పౌరులు కారని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అయ్యుండవచ్చని పాక్ జవాబిచ్చింది. ఇదివరకు కార్గిల్ యుద్ధంలో భారత్ భద్రతాదళాల చేతిలో పాక్ సైనికులు మరణించినపుడు కూడా వారిని తమ దేశపౌరులుగా గుర్తించడానికి పాక్ ఇష్టపడలేదు. ఆ తరువాత ముంబై దాడులలో సజీవంగా పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది అజ్మల్ కసాబ్ ని కూడా తమ పౌరుడిగా గుర్తించడానికి పాక్ అంగీకరించలేదు. వారి శవాలను తీసుకొన్నట్లయితే పాక్ గడ్డ మీద నుంచే భారత్ పై దాడులకు కుట్రలు జరుగుతున్నాయని భారత్ చేస్తున్న ఆరోపణలను అంగీకరించినట్లవుతుందనే భయంతో, వారు తమ దేశానికి చెందినవారు కారని పాక్ బుకాయించింది.
గత మూడు-నాలుగు దశాబ్దాలుగా భారత్ పై పాక్ ఏదో విధంగా పరోక్షయుద్ధం చేస్తూనే ఉందనే సంగతి యావత్ ప్రపంచానికీ తెలుసు. కళ్ళు మూసుకొని పాలు త్రాగే పిల్లి ఆ విషయం లోకానికి తెలియదనుకొన్నట్లుగానే, మరణించిన ఉగ్రవాదులను, సైనికులను తమ పౌరులుగా అంగీకరించకపోతే తన కుట్రలు కుతంత్రాల గురించి లోకానికి తెలియదనుకొంటుంది పాకిస్తాన్. ఆ నలుగురు ఉగ్రవాదుల శవాలను స్వాధీనం చేసుకోవడానికి పాక్ నిరాకరించడంతో, వారిని పఠాన్ కోట్ లోనే ముస్లిం మతాచారాల ప్రకారం ఖననం చేసారు.