ఒకవైపు ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో అన్ని విషయాల్లోనూ కాలయాపన మాత్రమే కనిపిస్తున్నది. కేంద్రంతో సామరస్యంగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోవాలనే మాట వినిపిస్తుందే తప్ప.. సాధించినది ఏమిటో కనిపించడం లేదు. అదే సమయంలో తెలంగాణ నిర్దిష్టంగా కేంద్రాన్ని తాము అడిగిన అంశాలను సాధించుకోగలుగుతున్నది. ఎఫ్ఆర్బీఎం రుణపరిమితి విషయంలో కేంద్రంనుంచి తెలంగాణ తాము అనుకున్నది సాధించింది. చంద్రబాబునాయుడు ప్రపచంలో ఏ సీఎం లేనంతగా తాను 22 సార్లు ఢిల్లీ వెళ్లానని అంటారు గానీ, తెలంగాణకు ఎఫ్ఆర్బీఎం సాధించడానికి కేసీఆర్ ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్లలేదనే సంగతి ఆయన గుర్తించాలి. కేవలం మంత్రి ఈటెల మాత్రమే ఢిల్లీ వెళ్లి దాన్ని సాధించుకువచ్చారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యాక్షన్లోకి దిగుతున్నారు. కేంద్రంనుంచి తమ రాష్ట్రానికి కావాల్సిన వాటిని సాధించుకోవడానికి ఆయన ఢిల్లీ యాత్రకు సోమవారం సాయంత్రం బయలుదేరనున్నారు.
కేంద్రంనుంచి తెలంగాణకు కావాల్సిన వాటిని సాధించుకు రావడం ఎజెండాగా కేసీఆర్ యాత్ర సాగుతున్నది. ప్రధానంగా తమ రాష్ట్రంలో జిల్లాల పెంపు విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన కేసీఆర్, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు తంతును కూడా ముగించడానికి వేగిరపడుతున్నట్లున్నారు.
తన పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్రమోడీతో కేసీఆర్ సమావేశం అవుతారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచినందుకు ఆయన ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు గురించి చర్చిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును సభ ముందుకు తెచ్చి ఆమోదించాల్సిందిగా కేసీఆర్ ప్రధానిని కోరుతారని తెలుస్తున్నది.
సెగ్మెంట్ల విషయంలో గతంలో వెంకయ్యనాయుడు ఇదే విషయం చెప్పారు. తాను సంబంధిత శాఖలు మంత్రులతో మాట్లాడేశానని.. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండో విడత మొదలు కాగానే బిల్లు సభలోకి వచ్చేస్తుందని చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి చప్పుడు లేదు. చంద్రబాబులాగా వెంకయ్యనాయుడును నమ్ముకోకుండా కేసీఆర్ స్వయంగా తానే ప్రధానితో భేటీ అయి పనులు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది.
తెలంగాణలోని కరవు, కేంద్రం నుంచి సాయం కోసం కూడా ఆయన అభ్యర్థించబోతున్నారు. ఏతావతా.. చంద్రబాబు ఎన్డీయేలో పేరుకు భాగస్వామిగా ఉండడంతో పాటూ, ఎక్కువసార్లు ఢిల్లీకి తిరుగుతున్నారే తప్ప.. కేంద్రంనుంచి సాధించే రీత్యా తెలంగాణకే ఎక్కువ దక్కుతున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.