ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ఇంటర్వ్యూలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక ప్రశ్నకు సమాధానంగా, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వ వైఫల్యాలను అందిపుచ్చుకొని వాటిని తన పార్టీకి అనుకూలంగా మలుచుకోవడంలో విఫలం అయ్యారనే అభిప్రాయం వ్యక్తం చేసారు. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నా ఇంకా కొన్ని సమస్యలున్నాయి. జగన్ వాటిని గుర్తించి సరిగ్గా వ్యవహరించగలిగి ఉంటే, ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందిపెట్టగలిగి ఉండేవారు. కానీ ఆయనలో రాజకీయ పరిపక్వత లోపించడం, సమస్యల పట్ల ఆవగాహనారాహిత్యం, తన పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్ళే గుణం లేకపోవడం చేత అందివస్తున్న అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. వాటిని సరిగ్గా ఉపయోగించుకొంటే ఆయన రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కలిగేది. ఇటువంటి లక్షణాలున్న ప్రతిపక్ష నేత ఉండటం తెదేపా అదృష్టమేనని చెప్పాలి. కనుక వచ్చే ఎన్నికలలో తెదేపా విజయం సాధించడం ‘కేక్ వాక్’ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు.
తమ ప్రభుత్వ వైఫల్యాలకే గంటా శ్రీనివాసరావు ‘సమస్యలు’ అనే పదం ఉపయోగించారని చెప్పవచ్చు. అంటే తెదేపా నేతలు కూడా తమ వైఫల్యాలను బాగానే గుర్తించారని అర్ధమవుతోంది. అయితే ఆయన చెపుతున్నట్లుగా జగన్ ఆ ‘సమస్యలపై’ పోరాడకుండా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. దొరికిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వాన్ని శాసనసభలో, బయటా కూడా ఎండగడుతూనే ఉన్నారు. కానీ మంత్రి గంటా చెపుతున్నట్లుగా జగన్ తన పార్టీలో అందరినీ కలుపుకొని సమిష్టి నిర్ణయాలు, వ్యూహాలు అమలుచేయకుండా తనకు తోచినట్లే పోరాటాలు చేస్తునందున వాటి వలన తనకీ, పార్టీకి రాజకీయ మైలేజి పొందకపోగా తరచూ స్వయంగా తను భంగపడుతూ పార్టీకి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నారు.
ఆకస్మికంగా ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షకు కూర్చోవడం, రోజా సస్పెన్షన్ పై వ్యవహరించిన తీరు, రాజ్ భవన్ దగ్గర తెదేపా ప్రభుత్వాన్ని కూలుస్తామని సవాలు చేయడం, తెలంగాణా ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కర్నూలులో దీక్షకు కూర్చోవాలనుకోవడం వంటివి అందుకు కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. వాటి వలన వైకాపాకి నష్టమే జరుగుతోంది తప్ప ఎటువంటి లాభము కలుగలేదు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు మళ్ళీ వెనక్కి తగ్గినప్పుడు కూడా జగన్ దానిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో వైఫల్యం చెందారు. అదే మాట మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారని భావించవచ్చు.