ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇన్నాళ్లకు కాస్త ఆలస్యంగానైనా మెలకువ వచ్చినట్లు కనిపిస్తోంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బోలెడన్ని నిధులు తవ్వి తలకెత్తేసింది.. అని ఒకవైపు భాజపా రాష్ట్రమంతా తిరుగుతూ టముకు వేసుకుంటున్న తరుణంలో.. ఈ విషయంలో ప్రజలకు వాస్తవాల్ని తెలియజెప్పకపోతే తామే నష్టపోతాం అనే సంగతి ఇన్నాళ్లకు చంద్రబాబుకు బోధపడినట్లు ఉంది. ఆదివారం నాడు పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో సమావేశమైనప్పుడు ఈ అంశాన్ని కూడా చంద్రబాబు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తున్నది. కేంద్రంనుంచి వస్తున్న నిదుల విషయంలో అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌కు దక్కవలసినవి ఎన్ని? అదనంగా విభజన నేపథ్యంలో ఆ చట్టం ప్రకారం తమకు దఖలు పరచిన నిధులెన్ని? అనే క్లారిటీని ప్రజల ముందు పెట్టాలని చంద్రబాబు నిర్ణయించడం విశేషం. ఇన్నాళ్లకు భాజపా ప్రచారాలకు కౌంటర్ ఇవ్వాలనే ఆలోచన ఆయనకు వచ్చింది.
కేంద్రం మరియు భాజపాల విషయంలో తెలుగుదేశం పార్టీ తొలినుంచి మెతక వైఖరిని అనుసరిస్తుండడాన్ని భాజపా చులకనగా తీసుకున్నదని మనం భావించాలి. ఎందుకంటే.. కేంద్రంతో సామరస్యంగా సాధించాలని వారు అనుకుంటూ ఉంటే, కేంద్రం చాలా చేసేసింది.. కేంద్రం ఇచ్చిన సొమ్ములనంతా చంద్రబాబు దుర్వినియోగం చేసేశారు అనే తరహా ప్రచారానికి భాజపా తెగబడుతూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తొలినాళ్లలో చంద్రబాబు అంటే విముఖత ఉన్న ఒకరిద్దరు భాజపా నాయకులు మాత్రమే ఈ తీరు కనబరుస్తున్నారని అనుకుంటే.. తర్వాత్తర్వాత రాష్ట్ర భాజపా విధానంగానే అది మారిపోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా భాజపా కొత్తగా బలం పుంజుకోదలచుకుంటున్న ప్రతిచోటా.. కరపత్రాలు ముద్రించి… కేంద్రం పుష్కలంగా నిధులు ఇచ్చేస్తూ ఉన్నప్పటికీ చంద్రబాబు సర్కారు వాటిని దారి మళ్లిస్తున్నదని ఊరూరా తిరిగి ప్రచారం చేయడానికి భాజపా శ్రేణులు శ్రీకారం చుట్టాయి. ఈ ప్రచారం యావత్తూ.. ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలు అనే ఆలోచననే ప్రజలు మరచిపోయేలా.. శత్రు పార్టీ గురించి భాజపా ప్రచారం చేస్తున్నట్లుగా సాగిపోయాయంటే అతిశయోక్తి కాదు. ఈ తరహా భాజపా వక్ర ప్రచారాలకు కౌంటర్ ఇవ్వాలని చంద్రబాబునాయుడు తాజా సమావేశంలో నిర్ణయించారు. కేంద్రం నుంచి ఈ రెండేళ్లలో అన్ని రాష్ట్రాల మాదిరిగా ఏపీ హక్కుగా దక్కే నిధుల్ని ఎంత మేరకు ఇచ్చారు, విభజన వలన అదనంగా ఎంత మేర ఇచ్చారు అనే వివరాల్ని.. రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా తెలియజెప్పాలని చంద్రబాబు నిర్ణయించారు. తెదేపా మంత్రులు , శ్రేణులు ఈ ప్రచారంతో పార్టీ పరువు కాపాడాలని, కేంద్రం వలన మనం అన్యాయానికి గురవుతున్నామనే స్పృహను ప్రజల్లో కలిగించాలని ఆయన ఇన్నాళ్లకు పూనుకోవడం విశేషం.
అసలే హోదా విషయంలో కేంద్రం వంచనను గుర్తించి కుతకుతలాడిపోతున్న తెలుగు ప్రజలు , చంద్రబాబు వెల్లడించే వాస్తవాలు తెలిశాక మరింత ఆగ్రహించినా ఆశ్చర్యపోనవసరం లేదేమో!