సంప్రదింపులతో హోదా అనుమానమే!!
నిద్రపోయే వారిని లేపడానికి ఆందోళనలు, ఉద్యమాలు అవసరం కావచ్చు. నిద్రనటించే వారిని లేపడానికి కొత్తమార్గాలను కనుగొనవలసిందే. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక తరహా ప్రతిపత్తి కోసం కేంద్రంతో తెగతెంపులు చేసుకోవలసిందన్న సూచనల్లో రాజకీయ దృష్టి తప్ప వాస్తవిక దృక్పధం లేదు. సమావేశాలు, సంప్రదింపులు, విజ్ఞప్తుల ద్వారా మాత్రమే ప్రత్యేక హోదాతో సహా అన్ని కోరికలనూ సాధించుకోవాలే తప్ప ఘర్షణాత్మక వత్తిడితో కాదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఎమోషనల్ గా వున్న ప్రజలకు నచ్చదు. అయితే అందులో కొంత వాస్తవికత వుంది.
ఇందులో పైకి కలిపించే లోపం రాజకీయపార్టీలు ఒకరినొకరు నిందించుకునే బ్లేమ్ గేమ్ అయితే…కనిపించని అసలు కారణం ప్రజల్లో ఉద్యమించే స్వభావం అంతరించిపోవడమే…ఆందోళనకారులను ఆదరించి సహకరించే స్వభావం మధ్యతరగతి ప్రజల్లో అంతతరించిపోవడమే!
నిజానికి ఆంధ్రప్రదేశ్ కి సంబందించినంత వరకూ 1967 నుంచి తెలంగాణా ఏర్పడే వరకూ అనేక విరామాలతో వాయిదాలపద్ధతిలో జరిగిన తెలంగాణా ఉద్యమం, 1969 లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం 1972 లో ప్రత్యేకాంధ్ర ఉద్యమం మినహా మరో ప్రజా ఉద్యమమే లేదు.
ప్రజాసమస్యల పై ఉద్యమాలకు ఎక్కడికక్కడ సమాజంలో పెద్దలే నాయకత్వం వహించేవారు. రాజకీయపార్టీలు ఆ నాయకత్వానికి లోబడే పనిచేసేవి. ఉద్యమాల్లో ముందుండే ఆందోళనకారుల బృందాలకు మధ్యతరగతి ప్రజలు ఆశ్రయం ఇచ్చేవారు…భోజనం పెట్టేవారు…ఖర్చులకు డబ్బులిచ్చేవారు. అలాంటి నైతిక పునాదులపై సాగిన ఉద్యమాలు సుదీర్ఘకాలం కొనసాగేవి. స్వాతంత్రోద్యమమే ఇందుకు పెద్ద ఉదాహరణ.
జనజీవన శైలిలో మార్పులు ఒకరికోసం అందరు…అందరికోసం ఒకరు అనే సామాజిక స్పృహను చంపశాయి. ఉమ్మడికుటుంబాలలో వున్న ఊరి సమస్యల ప్రస్తావన న్యూక్లియస్ కుటుంబాలలో మాయమైపోయింది. ఉద్యమకారులు విశ్రమించిన లివింగ్ రూమ్ లు టెలివిజన్లకే చాలడంలేదు.
ఇన్ని కారణాల వల్ల ”సామాజిక స్పృహ” తలదాచుకోడానికి మనుషుల మధ్య ఆశ్రయమే లేకుండా పోయింది. ఇందువల్లే సీమాంధ్ర ప్రాంతంలో ”విశాఖ ఉక్కు”, ”ప్రత్యేకాంధ్ర” ఉద్యమాల తరువాత మరో ప్రజా ఉద్యమే లేకుండా పోయింది.
తెలంగాణా ఏర్పాటుకి ముందు సీమాంధ్రప్రాంతంలో జరిగిన ఆర్గనైజ్డ్ ఊరేగింపులను మహా ఉద్యమంగా రాజకీయ నాయకులు కూడా అభివర్ణించేవారు . అస్ధిత్వ భావనల వల్ల సంఘాలు సంఘాలుగా ఏర్పడిన ప్రజలు తమవంతు బాధ్యతగా ఊరేగడం, టివిలను, పేపర్లను పిలిచి కవరేజి వచ్చేలా చూసుకోవడమే మహా సమైక్య ఉద్యమంగా ప్రచారమైపోయింది. నాయకులు ఉద్దేశ్య పూర్వకంగానే ఈ ప్రచారాన్ని మరింత ఉధృతంచేశారు.
కష్టాలు, పెనుగులాటలు, ఘర్షణలు, త్యాగాలు లేని ఉద్యమం…ఉద్యమమే కాదన్న స్పృహే లేని ఊరేగింపులు మహోద్యమంగా చెలామణి అయిపోయాయి. అలాగని ప్రజల్లో సమైక్యభావనలు లేవని కాదు..సాధించకునే ఉద్యమానికి, ఊరేగింపుకి తేడా తెలియదని మాత్రమే!
ఈ నేపధ్యంలో ఏమార్పూ లేదు. ఇలాగే ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తే అది ఫలితాన్ని ఇవ్వగలుగుతుందా? ”ఉద్యమించో గొడవపడో సాధించలేము. సంప్రదింపులే డిమండ్ల సాధనకు మార్గం అని చంద్రబాబు భావిస్తూండటానికి ప్రజల్లో ఉద్యమ స్పూర్తి లేదని గుర్తించడమే కారణం కావచ్చు.
అయితే, చంద్రబాబు భావిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ అవసరాలపై సంప్రదింపులు లేదా లాబీయింగ్ చేయడానికి విషయపరిజ్ఞానం, సమర్ధత, కమిట్ మెంటు వున్న నాయకులు తెలుగుదేశం పార్టీకి లేరు. వడ్డే శోభనాద్రీశ్వరరావు, డాక్టర్ యలమంచలి శివాజీ వంటి పార్లమెంటేరియన్లు లోక్ సభలో, రాజ్యసభలో చేసిన సూచనలు, ఇచ్చిన సలహాలు దేశవ్యాప్తంగా వ్యవసాయదారుల ప్రయోజనాలను కాపాడే నియమ నిబంధనలుగా మారిపోయాయి. అలాంటి క్వాలిటీలు లేని నాయకులతో చంద్రబాబు ఎలాంటి లాబీయింగ్ లు చేయించగలుతారో తెలుగుదేశం పార్టీకే తెలియాలి!
ఏది ఏమైనా ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాలు, పోరాటాలు, ఘర్షణాత్మక వైఖరికి చంద్రబాబు భావిస్తున్నట్టు ఇది కాని కాలమే! సంప్రదింపుల ద్వారా మనవాళ్ళు ఏమేరకు సాధిస్తారో కూడా అనుమానమే!!