ఖమ్మం జిల్లాలోని పాలేరు ఉపఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన ప్రత్యర్దులుగా ఉన్న కాంగ్రెస్, తెరాస నేతలు చాలా వాడివేడిగా విమర్శలు చేసుకొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తన బద్ధ శత్రువైన తెదేపా, వైకాపాల మద్దతు కోరడాన్ని అనైతిక రాజకీయంగా తెరాస వాదిస్తుంటే, సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట రెడ్డి మృతి కారణంగా జరుగుతున్న ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆయన భార్య సుచరితా రెడ్డి ఎన్నికను ఏకగ్రీవం కానీయకుండా చేసి తెరాస ఒక దుసంప్రదాయాన్ని నెలకొల్పిందని టీ-కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
టీ-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేసారు. “మీరు చేపట్టిన మిషన్ భగీరథని దేశంలో అందరూ ప్రశంసిస్తున్నారని గొప్పగా చెప్పుకొంటునప్పుడు, దాని పూర్తి క్రెడిట్ మీకే దక్కేందుకు మా తండ్రి కేసీఆర్ ప్రయత్నించాలి కానీ ఆయన మీరు చూస్తున్న ఆ ప్రాజెక్టుని అకస్మాత్తుగా మీ నుంచి ఎందుకు తీసేసుకొన్నారు? దానిని ఎవరికీ ఈయకుండా తనవద్దే ఎందుకు అట్టేబెట్టుకొన్నారు? అని ప్రశ్నించారు.
మళ్ళీ దానికి సమాధానం కూడా ఆయనే చెప్పారు. “ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో ఖమ్మం జిల్లాలో చేపడుతున్న రెండు ప్రాజెక్టులలో రూ.10,000 కోట్లు అక్రమాలు జరిగాయి. ఆ ప్రాజెక్టులను కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నందున వాటిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకూ కూడా ఆయనదే బాధ్యత అవుతుంది. ఒకవేళ మున్ముందు ఎవరయినా దానిపై న్యాయస్థానాలలో కేసులు వేసి విచారణ జరిపిస్తే ముఖ్యమంత్రి కావలసిన కేటీఆర్ రాజకీయ భవిష్యత్ దెబ్బ తింటుంది. అందుకే కేసీఆర్ ముందు జాగ్రత్త చర్యగా తన కొడుకు దగ్గర నుంచి ఆ ప్రాజెక్టులను వెనక్కి తీసేసుకొన్నారు. అటువంటి అవినీతి పనులకు పాల్పడే పార్టీకి, నేతలకి కూడా పాలేరులో ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదు. ప్రజలే తెరాసకు గట్టిగా బుద్ధి చెపుతారు,” అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
మిషన్ భాగీరధ పనులను వేగవంతం చేసేందుకే దానిని కేటీఆర్ నుంచి వెనక్కి తీసుకొంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతున్నారు. కానీ దానినే మల్లు భట్టి విక్రమార్క మరో కోణంలోంచి చూపుతున్నారు. ఆ ఆరోపణలు నిజమనుకొంటే ఆయన వాదన కూడా నిజమేననుకోవలసి ఉంటుంది.