కింగ్ ఫిషర్ అధినేత విజయ మాల్యా రూ.9,000 కోట్లు బాకీలు తీర్చకుండా లండన్ పారిపోయినందుకు భారతీయులు అందరూ ఆయనపై చాలా కోపంగా ఉన్నారు. కానీ అంబానీ సోదరులు, ఎస్సార్, అదానీ తదితర సంస్థలు బ్యాంకులకు ఎంత బాకీ ఉన్నాయో తెలిస్తే గుండె గుభేల్మనడం ఖాయం. ముకేష్ అంబానీకి చెందిన వివిధ సంస్థలు రూ.1,87,079 కోట్లు, తమ్ముడు అనిల్ అంబానీ సంస్థలు రూ. 1,21,000 కోట్లు, టాటా గ్రూప్ సంస్థలు 10.7 బిలియన్ డాలర్లు, గౌతం అదానీ నేతృత్వంలో నడుస్తున్న అదానీ గ్రూప్ సంస్థలు రూ.96, 031 కోట్లు, శశి, రవి రుయాల నేతృత్వంలో నడుస్తున్న ఎస్సార్ గ్రూప్ సంస్థలు రూ.1,01, 461 కోట్లు, మనోజ్ గౌర్ కి చెందిన జెపి గ్రూప్ సుమారు రూ.75,000 కోట్లు, వేణుగోపాల్ ధూత్ కి చెందిన వీడియోకాన్ గ్రూప్ రూ.45,405 కోట్లు, నవీన్ జిందల్ కి చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ సంస్థలు రూ.46,000 కోట్లు బ్యాంకులకు బాకీలున్నాయి. వీరే కాక ఇంకా డి.ఎల్.ఎఫ్.గ్రూప్, భారత్ లో అత్యధికంగా చక్కరని తయారు చేస్తున్న శ్రీ రేణుక సుగర్స్, సహారా గ్రూప్ వంటి డజన్ల కొద్దీ అతిపెద్ద సంస్థలు బ్యాంకులకు కోట్లాది రూపాయలు బాకీలు పడ్డాయి. ఈ విషయంలో మన తెలుగువారు కూడా వారితో పోటీ పడుతున్నారు. గ్రంధి మోహన్ రావుకి చెందిన జి.ఎం.ఆర్. గ్రూప్ సంస్థలు రూ.42,349 కోట్లు, లగడపాటి రాజగోపాల్ కి చెందిన ల్యాంకో గ్రూప్ రూ. 47,102 కోట్లు, జివి. కృష్ణా రెడ్డికి చెందిన జివికె గ్రూప్ రూ.34,000 కోట్లు బాకీలున్నారు. వారితో పోలిస్తే విజయ మాల్యా బాకీ చాలా చిన్న మొత్తమేనని చెప్పవచ్చు. అయితే వారెవరూ ఆయనలాగ దేశం విడిచిపారిపోకుండా, బ్యాంకులకు చెల్లించవలసిన వడ్డీలను సకాలంలో చెల్లిస్తూ, దేశవిదేశాలలో ఉన్న తమ విలువైన ఆస్తులను అమ్మకానికి పెట్టి బాకీలు తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు కనుక ఎవరూ వారిని వేలెత్తి చూపడం లేదు.
దేశంలో పది అతిపెద్ద సంస్థల బాకీలు సుమారు రూ.5లక్షల కోట్లుకు పైనే ఉంది. వాటిని తీర్చడం కోసం అవి సుమారు రూ.2 లక్షల కోట్ల విలువయిన తమ ఆస్తులను అమ్మకాలకి పెట్టాయి. వాటిలో విమానాలు, ప్రైవేట్ జెట్ విమానాలు, షిప్పులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, స్టార్ హోటల్స్, షాపింగ్ మాల్స్ కార్పోరేట్ ఎమ్యూజ్ మెంట్ పార్కులు, సిమెంటు, స్టీలు తదితర కంపెనీలు, బొగ్గు గనులు, ఆయిల్ బావులు, వాటి షేర్లు, అవి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే తమ ప్రధాన కార్యాలయాలను, వీలయితే మొత్తం సంస్థలని చివరికి తాము దక్కించుకొని నిర్మించిన రోడ్ కాంట్రాక్టులని, క్రికెట్ టీములని, ఫార్ములా వన్ రేసింగ్ టీంలని…ఇలాగ అన్నిటినీ అమ్మకానికి పెట్టేస్తున్నారు.
భారత్ వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలకు ఇటువంటి దారుణ పరిస్థితి ఏర్పడటానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ఇతరుల కంటే తాము ఏవిధంగాను తీసిపోమని నిరూపించుకోవడానికో లేక తమ గొప్పదనాన్ని యావత్ ప్రపంచం గుర్తించాలనే తపనతోనో తమ శక్తికి మించి అప్పులు చేసి రకరకాల సంస్థలను ఏర్పాటు చేసుకొంటారు. ఉదాహరణకి ఆర్ధిక క్రమశిక్షణకి మారుపేరుగా చెప్పుకోబడే టాటా స్టీల్ సంస్థ 2007 సం.లో బ్రిటన్ లోని యు.కె.స్టీల్స్ ని 12.9 బిలియన్ డాలర్లు చెల్లించి స్వాధీనం చేసుకొంది. అది ఆ రోజుల్లో అతిపెద్ద ‘టేక్ ఓవర్’ కావడంతో యావత్ ప్రపంచంలో టాటా స్టీల్స్ పేరు మారుమ్రోగిపోయింది. కానీ అదే టాటా స్టీల్స్ ఆర్ధికంగా దెబ్బ తినడానికి, పరువు పోగొట్టుకోవడానికి కారణమయ్యింది. దానిపై ఆ సంస్థ మరో 2.9 బిలియన్స్ పెట్టుబడి కూడా పెట్టింది. ఇంతవరకు కనీసం ఆ పెట్టుబడి కూడా తిరిగి రాలేదు కానీ దాని కోసం చేసిన అప్పులు మాత్రం ఇంకా అలాగే మిగిలున్నాయి. కనుక తెల్ల ఏనుగులాగ మారిన ఆ స్టీల్ ప్లాంటుని టాటాలు అమ్మకానికి పెడుతున్నారు. అనిల్ అంబానీ కి చెందిన రిలయన్స్ గ్రూప్ సంస్థలు ఏడాదికి రూ.8,299 కోట్లు వడ్డీగా చాలా టంచనుగా చెల్లిస్తున్నాయి. అది విజయ మాల్యా చెల్లించవలసిన మొత్తం అప్పుకి దాదాపు సమానంగా ఉంది. అయితే అంబానీ వడ్డీ చెల్లిస్తున్నారు కనుక బ్యాంకులు ఆయనని చాలా మంచి కష్టమర్ అని నెత్తిన పెట్టుకొని పూజిస్తున్నాయి. విజయ మాల్యా అసలు, వడ్డీ రెండూ కూడా చెల్లించకుండా దేశం విడిచి పారిపోవడంతో ప్రజల దృష్టిలో పడ్డారు. బహుశః అందుకే బ్యాంకులు ఆయన వెంటపడుతున్నాయేమో?