పశ్చిమ గోదావరి జిల్లా వైకాపా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు తెదేపాలో చేరబోతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన స్వయంగా ఈరోజు దృవీకరించారు. తను తెదేపాలో ఎప్పుడు చేరబోయేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. తను ఎమ్మెల్యేని కాకపోయినా చంద్రబాబు నాయుడు తనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తునందుకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషిని చూసి ఆయన వలననే అది సాధ్యం అవుతుందనే నమ్మకంతోనే తను తెదేపాలో చేరబోతున్నట్లు మీడియాకి తెలిపారు.
ఒక జిల్లా అధ్యక్షుడయిన కొత్తపల్లి పార్టీని వీడి వెళ్ళిపోవడం వైకాపాకు చాలా బలమయిన దెబ్బే అవుతుంది. ఆయన వెళ్ళిపోవడం వలన మరో రెండు సమస్యలను కూడా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవలసి ఉంటుంది. ఆయన ఖాళీ చేసిన జిల్లా అధ్యక్ష స్థానం కోసం జిల్లాలో వైకాపా నేతల మధ్య కీచులాటలు మొదలవవచ్చు. అయన వెళ్లిపోతూ పార్టీపై, దాని అధ్యక్షుడిపై ఏవయినా విమర్శలు చేస్తే వాటిని జీర్ణించుకోవడం కూడా కష్టమే.