ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా నిరాకరణపై నిరసన మార్గం గాక నీరస విజ్ఞప్తి మార్గమే మంచిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం తెలుగుదేశం వారికే మింగుడుపడటం లేదు. ఆయన ఎంత ఒదిగివున్నా బిజెపి తన వ్యూహాన్ని మార్చుకునే అవకాశం కూడా లేదు. దీన్ని ప్రజలు పట్టించుకోరన్న అంచనా కూడా మార్చుకోవలసి రావచ్చు. ఇంతకూ ప్రత్యేక హోదా కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదని రాష్ట్ర అస్తిత్వ సవాలు అని ముందు ముందు మరింతగా అర్థం అవుతుంది. పైగా ఈ సమస్య ఎపితో పాటు గతంలో ఈ హోదా పొంది పోగొట్టుకున్న వాటికి కూడా వుంది.
హైదరాబాద్ తెలంగాణ రాజధాని అయ్యాక ప్రధానంగా వ్యవసాయిక రాష్ట్రంగా మిగిలిన ఎపిలో ఉపాధి పెరగాలన్నా పరిశ్రమలు ఐటి వంటి రంగాల్లో చాలా విస్తరించాలి. ఆ మేరకు పెట్టుబడులు రావడానికి రాయితీలు కావాలి. ప్రత్యేక హోదా అందుకొక ఇంధనంగా పనిచేస్తుంది..
గతంలో ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లతో పాటు ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమచల్ ప్రదేశ్ పదకొండు రాష్ట్రాలకు హోదా ఇచ్చినప్పుడు కొన్ని ప్రత్యేక కారణాలుంటే, విభజిత ఎపికి మరో విధమైన ప్రత్యేక పరిస్థితి వుంది. ఆ రాష్ట్రాల వలె గిరిజన ప్రధాన రాష్ట్రం కాకపోయినా ఇక్కడ కూడా గణనీయమైన గిరిజన ప్రాంతం బాగా వెనకబడివుంది కూడా. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను వెనుకబడినవిగా కేంద్రమే అంగీకరించింది. అంటే సగానికిపైగా వెనకబడిన ప్రాంతమన్నమాట.
గతంలో ప్రత్యేక హోదా కారణంగా హిమచల్ ప్రదేశ్‌లో పరిశ్రమలు 34 శాతం, ఉత్తరాఖండ్‌లో 24.4శాతం పుంజుకోవడం బాగా ఉపయోగపడింది. తర్వాత అది నిలబడలేదంటే అది పాలకుల వైఫల్యం. ప్రత్యేక హోదా లేకపోతే మనుగడే సాధ్యం కాని పరిస్థితి. మోడీ సర్కారు వాటికీ ఎసరు పెడుతుంటే ఆందోళన చెందిన ఎనిమిది మంది ఈశాన్యా ముఖ్యమంత్రులూ కలసి కట్టుగా ఒక లేఖ రాశారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఎన్డిసి సమావేశంలో ప్రత్యేక హోదాను నీరుగార్చవద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తిచేశారు. అస్సాం ముఖ్యమంత్రి దీనిపై కోర్టుకు వెళతామన్నారు. అయినా బీహార్ ఎన్నికల ప్రచారంలో అరుణ్‌జైట్లీ అది ముగిసిన అధ్యాయం అని ప్రకటించారు. కొత్తగా కోరేవాటిని పరిశీలించకపోవచ్చు గాని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కేంద్రం రాజ్యాంగ బాధ్యత.
ఎపికి ఏదో విధంగా పారిశ్రామిక ఉత్పత్తి రంగాలను పెంచకోవలసిన ఆవశ్యకత చాలా వుంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణలకు విభజన తర్వాత పరిస్థితికి చాలా తేడా వుంటుందని తాజా వివాదాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిపై సహేతుక చర్చలకు ఇరు రాష్ట్రాలూ సిద్ధపడటం లేదు. ఏమైనా ఎగువన వున్న తెలంగాణ తన హక్కుగా త్వరితంగా విస్తారంగా బ్యారేజీలు పూర్తిచేసుకుంటే కిందకు వచ్చే ప్రవాహాలు గణనీయంగా ప్రభావితమవుతాయి. దానికి తోడు అసాధారణ వాతావరణ పరిస్థితులతో నీటిమట్టాలు అడుగంటుతున్నాయి. ప్రపంచీకరణ ఒప్పందాలు కేంద్రం విధానాల కారణంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతున్నది.
అలాటప్పుడు కేవలం పాత డెల్టా వ్యవస్థనూ, వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకుని పరిశ్రమలను ఇతర విభాగాలను పెంచుకోకపోతే ఉపాధి అభివృద్ధి రెండూ మిథ్యే అవుతాయి. ప్రకృతి వనరులు సుదీర్ఘ సముద్ర తీరం వున్న ఎపి వంటి రాష్ట్రానికి ప్రత్యేక రాయితీలు కలిస్తే అలాటి అవకాశాలు మెరుగవుతాయి. అలాగాకుంటే ఇప్పటికే విదేశీ కార్పొరేట్లచుట్టూ తిరుగుతున్న చంద్రబాబు ప్రభుత్వం రేపు కేంద్రం సహాయ నిరాకరణను సాకుగా చూపి ఆ పోకడలు మరింత తీవ్రం చేస్తుంది. తద్వారా ప్రజలు ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలు శ్రామికులు అణగారిన తరగతులు మరింత నష్టపోతారు.
నిజానికి కేంద్రం నుంచి రావలసినదానిపై రాష్ట్రం చూపాల్సినంత శ్రద్ద చూపకపోవడానికి ఈ కార్పొరేట్ వ్యూహం కూడా ఒక ప్రధాన కారణం. రాజధాని నిర్మాణం కూడా ప్రైవేటు వ్యవహారంగా నడిపించేందుకే అది ఆతృత పడుతున్నది. ఏతావాతా ఇది బిజెపి టిడిపిల రాజకీయ వ్యూహాల సమస్యగా మారిపోవడం అనుమతించరాని విషయం.
కాంగ్రెస్ చట్టంలో పొందుపర్చలేదు గనక మేము ఇవ్వలేకపోయామని చెప్పడం ప్రజల ఇంగితజ్ఞానానికే అవమానం. వెంటనే కాకపోయినా సమస్యలు ముదిరిన తర్వాతనైనా ప్రజల అసంతృప్తి కారకాల్లో ఇది ముఖ్యంగా ముందుకు వస్తుంది. అప్పుడు ఎన్ని సమర్థనలు చేసుకున్నా ప్రయోజనం వుండదు. బిజెపికన్నా టిడిపిదే ప్రధాన బాధ్యత అవుతుంది. ఎందుకంటే బిజెపి తనదైన బాణీలో చంద్రబాబు ప్రభుత్వంపైనే నెపం పెట్టి తన దారి తాను చూసుకోవాలని చూస్తుంది. అప్పుడు టిడిపి బాణీ మార్చినా విలువ వుండదు, విశ్వసనీయతా వుండదు.