సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇవ్వాళ్ళ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్, భాజపాల బలనిరూపణ పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడం కోసం రాష్ట్రంలో ఆ రెండు గంటలపాటు రాష్ట్రపతి పాలనకు విరామం ప్రకటించింది. బలపరీక్ష పూర్తవగానే మళ్ళీ యధాప్రకారం రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుందని సుప్రీం కోర్టు తన తీర్పులో ప్రకటించింది. దాని ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను శాసనసభ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి పర్యవేక్షిస్తారు.
అనర్హత వేటు పడిన 9మంది కాంగ్రెస్ సభ్యులు నిన్న హైకోర్టు, సుప్రీం కోర్టుకి వెళ్ళినా వారికి రెండు చోట్లా ఎదురుదెబ్బలే తగిలాయి. ఈరోజు జరిగే బలపరీక్షలో వారు ఓటు వేయడానికి వీలులేదని రెండు కోర్టులు తేల్చి చెప్పాయి. దానితో శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 61కి పడిపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమయిన మ్యాజిక్ నెంబరు:31 అయ్యింది. తనకు మద్దతు ఇచ్చేందుకు సిద్దపడిన 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా సుప్రీం కోర్టు కూడా ద్రువీకరించడంతో వారి అండతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకొన్న భాజపా తీవ్ర నిరాశ చెందింది.
ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో హరీష్ రావత్ (కాంగ్రెస్) కి 27మంది, భాజపాకి 28 మంది సభ్యులున్నారు. వారు కాక శాసనసభలో బి.ఎస్.పి-2, యూ.కె.డి.-1, స్వతంత్రులు-3 సభ్యులు ఉన్నారు. వారు ఎవరివైపు మ్రోగ్గితే వారికే అధికారం దక్కుతుంది. ఆ ఆరుగురు కూడా మొదట నుంచి హరీష్ రావత్ కే మద్దతు పలుకుతున్నారు కనుక ఇవ్వాళ్ళ కూడా శాసనసభలో ఆయనకే మద్దతు పలుకుతారని అనుకోవచ్చు. కానీ ఆఖరి నిమిషంలో ఏదయినా జరుగవచ్చు. కనుక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూసినట్లయితే హరీష్ రావత్ మళ్ళీ అధికారం దక్కించుకొనే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ తెర వెనుక ఎమ్మెల్యేల బేరసారాలు చాలా జోరుగా సాగే అవకాశాలున్నందున ఆఖరు నిమిషం వరకు ఆ విషయం ఖచ్చితంగా చెప్పడం కష్టమే.
శాసనసభలో బలపరీక్ష ప్రక్రియని మొత్తం వీడియో రికార్డింగ్ చేయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. శాసనసభ బలపరీక్ష ఫలితాలను సీల్డ్ కవర్ లో ఉంచి రేపు మధ్యాహ్నం 11.30గంటలలోగా తన ముందుంచాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ రోజు మధ్యాహ్నంకల్లా ఉత్తరాఖండ్ లో ఎవరు అధికారంలోకి రాబోయేది తెలియవచ్చు.