ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేయడంలో మోడీ సర్కారు వంచన మార్గాన్నే అనుసరిస్తున్నదని చాలా స్పస్టంగా అర్థమవుతోంది. ప్రత్యేకహోదా అయిదేళ్ల పాటు ఇవ్వబోతున్నట్లుగా సాక్షాత్తూ ప్రధానమంత్రి, సభలోనే వెల్లడించిన అంశానికి విలువ లేదననట్లుగా ఇప్పుడు సర్కారు వంకర మాటలు మాట్లాడడం వారి బుద్ధిని బయటపెడుతోంది. అయితే ఈ విషయంలో కేంద్రం ఎలాంటి వైఖరిని అనుసరిస్తన్నప్పటికీ, ప్రధాని సభలో చేసిన ప్రమాణానికి ప్రత్యేకమైన విలువ ఉంటుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో సముద్ర జలాల అంతర్జాతీయ ట్రైబ్యునల్ న్యాయమూర్తిగా ఉన్న రాజ్యాంగ నిపుణులు పీసీ రావు ఈ విషయంలో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. చట్టంలో లేదంటూ కేంద్రం తప్పించుకోవడం సాధ్యం కాదని చెప్పడం గమనార్హం.
ప్రధాని సభలో చెప్పిన మాట చట్టబద్ధమైన హామీనే కదా.. ప్రధాని ఆ హామీ ఇచ్చిన తర్వాతనే బిల్లు ఆమోదం పొందిందే తప్ప.. హామీకి ముందు కాదు కదా.. కనుక హామీ కూడా బిల్లులో భాగమే అవుతుంది కదా అని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా దక్కాలనే వారందరూ ప్రస్తుతం వాదిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ను తన అవకాశవాద రాజకీయాలకు అడ్డంగా వాడుకోదలచని మోడీ మాత్రం ఎన్నికలకు ముందు హోదా ఇవ్వడం గురించి మన రాష్ట్రంలో ప్రచార సభలో పదేపదే ప్రస్తావించారు. ఎన్నికల్లో తమకు పూర్తి మెజారిటీ వచ్చేసరికి ఇక హామీలన్నిటినీ పక్కన పెట్టారు. ‘చట్టంలో ఉన్నంత వరకు చేస్తాం’ అనే పాట పాడుతూ ఏపీకి అన్యాయం చేయడానికి చూస్తున్నారు.
రాజ్యాంగ నిపుణులు మాత్రం కేంద్రం ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరిని తప్పు పడుతున్నారు. ప్రధాని సహా మంత్రులు సభాముఖంగా ఇచ్చే హామీలకు న్యాయబద్ధత ఉంటుందని వాటినుంచి తప్పించుకోవడం కుదరదని చెబుతున్నారు. రాజ్యసభలో అప్పట్లో బిల్లు తెచ్చినప్పుడు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు లు ప్రధానితో విడిగా ప్రత్యేకహోదా గురించి మాట్లాడిన తర్వాతే సభలో దానికి ఓటు వేశారని అంటున్నారు. అలాంటిది ప్రధాని హామీకి విలువ ఉంటుందో లేదో న్యాయపండితుడు జైట్లీకి తెలియదా? అని పీసీరావు అనడం విశేషం.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంత సామరస్యపూర్వకంగా వెళ్లినప్పటికీ అంతిమంగా న్యాయపోరాటానికి దిగితే మాత్రమే మన రాష్ట్రానికి హోదా విషయంలో ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది. ప్రధాని హామీకి కచ్చితంగా న్యాయబద్ధత ఉందంటున్న ఆయన , అంతిమ పరిష్కారంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని సూచిస్తున్నారు. అయితే కేంద్రం మోసపూరిత, నయవంచన వైఖరి స్పష్టంగానే తేలుతున్నందున.. ఏపీ సర్కారు కేంద్రంతో తమ సంబంధాలను చెడగొట్టుకోకుండానే న్యాయపోరాటానికి దిగితే గనుక.. న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది.