మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైకాపా నుంచి బయటకు వచ్చి సుమారు రెండేళ్ళవుతోంది. ఆయన తెదేపా, భాజపాలలో ఏదో ఒక పార్టీలో చేరుతారంటూ మీడియాలో చాలా ఊహాగానాలు వినిపించాయి. ఆయన అనుచరులు గండి బాబ్జి, సర్వేశ్వర రావు తెదేపాలో చేరారు కానీ ఆయన మాత్రం నేటి వరకు ఏ పార్టీలోను చేరలేదు. ఇంకా ఏ పార్టీలో చేరుతారో ఎవరికీ తెలియదు. అయన ఉన్నటుండి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి వగైరా హామీలను అమలుచేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి మొన్న ఒక లేఖ వ్రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆ లేఖలో ప్రధాని మోడీకి భాజపా ఎన్నికల హామీలను గుర్తు చేసి, రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి రూ.15,000 కోట్లు ఇవ్వాలని, బుందేల్ ఖండ్, కోరాపుట్-బొలంగీర్-కలహండిలకు ఇచ్చినట్లే ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన కారణంగా రాజధాని లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీలయినంత త్వరగా రాజధాని నిర్మించుకోవడానికి ఉదారంగా నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చి వేగంగా రాష్ట్రాభివృద్ధి జరిగేందుకు తక్షణమే ప్రత్యేక హోదా మంజూరు చేయాలని కొణతాల తన లేఖలో ప్రధానిని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్, రాష్ట్ర ఎంపిలు కోరితేనే పట్టించుకోని ప్రధాని నరేంద్ర మోడీ, ఒక రాజకీయ నిరుద్యోగి అయిన కొణతాల లేఖని పట్టించుకొంటారనుకోలేము. ఈ విషయం బహుశః ఆయనకీ తెలిసే ఉండవచ్చు. అయితే గత రెండేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న అయన ఇపుడే అకస్మాత్తుగా ఎందుకు ఈ లేఖ వ్రాసారు? అనే అనుమానం కలుగక తప్పదు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి వైకాపా ఉద్యమిస్తోంది. కేంద్రానికి లేఖ వ్రాయడానికి ఆయన ఎంచుకొన్న సమయాన్ని బట్టి, ఆయన వైకాపాకి మద్దతుగానో లేదా అనుకూలంగా మాట్లాడుతున్నట్లుంది. కనుక ఆయన మళ్ళీ వైకాపాలోకి వెళ్ళే ఆలోచన ఏమయినా చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనుక అయన ముందు ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరో లేదా రాజకీయాల నుంచి శాస్వితంగా తప్పుకొంటున్నట్లో ప్రకటించేసి ఆ తరువాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే బాగుంటుందేమో?