ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డిగ్రీల వివాదం దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు తెరతీసింది. ఆయన పొలిటికల్ సైన్స్ లో ఎం ఎ చదివారని బీజేపీ నేతలు చెప్పారు. చాలా మంది అదే నమ్ముతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం ఇదంతా అబద్ధమంటున్నారు. ఆ వివాదం ఎలా ఉన్నా, పెద్ద పెద్ద దేశాధినేతలుగా సేవలందించిన వారిలో డిగ్రీ చదవని వారు ఉంటారా అనే మరో చర్చ మొదలైంది. ఉన్నత విద్యార్హతలు లేని స్మృతి ఇరానీ హెచ్ ఆర్ డి మంత్రి ఎలా అవుతారని రెండేళ్ల క్రితం కొందరు అభ్యంతరం చెప్పారు. కనీసం డిగ్రీ కూడా చదవకుండా అమెరికా అంతటి దేశాన్ని పాలించడం మరీ ఆశ్చర్యకరం కదా.
అగ్రరాజ్యం అమెరికాలో అసలు డిగ్రీ చదవకుండానే అధ్యక్షులుగా చక్రం తిప్పిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ డిగ్రీ చదవలేదు. అత్యంత ప్రాచుర్యం పొందిన అధ్యక్షుల్లో ఒకరైన అబ్రహాం లింకన్ కూడా కూడా డిగ్రీ చదవలేదు.
అమెరికా అంటే అగ్రరాజ్యం. ప్రపంచ పోలీస్. పెద్దన్న. ప్రపంచాన్ని శాసించే పవర్ ఫుల్ దేశం. కోట్లాది మంది దృష్టిలో భూతల స్వర్గం. అభివృద్ధికి పర్యాయపదం. అంతపెద్ద దేశాన్ని పాలించిన వారు కనీసం డిగ్రీ చదవలేదంటే ఆశ్చర్యమే.
జార్జి వాషింగ్టన్ అప్పట్లో లండన్ లో చదవాలనుకున్నారు. కానీ ఆయనకు 11 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించారు. దీంతో అనుకన్న ప్రకారం చదవలేకపోయారు. పుస్తకాలు చదవలేకపోయినా ప్రపంచాన్ని చదివారు. అందుకే 1789 నుంచి 1797 వరకు అమెరికా అధ్యక్షుడిగా సేవలందించారు. యువతకు చదువు చాలా ముఖ్యమని చెప్పేవారు.
అమెరికా ప్రముఖ అధ్యక్షుల్లో ఒకరైన అబ్రహాం లింకన్ కూడా డిగ్రీ చదవలేదు. అయినా న్యాయశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించారు. కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆరాటపడేవారు. అందుకే, ప్రతి మనిషికీ చదువు చాలా ముఖ్యమని చెప్పేవారు. వీరుకాక మరో 8 మంది అమెరికా మాజీ అధ్యక్షులు డిగ్రీ చదవలేదు.
అమెరికాలో ప్రభుత్వాన్ని నడిపేది అధ్యక్షుడు. భారత్ లో ప్రభుత్వానికి సారథి ప్రధాన మంత్రి. ఇప్పటి వరకు ప్రధాన మంత్రులుగా పనిచేసిన వారిలో దేవెగౌడ్ డిగ్రీ చదవలేదు. ఆయన సివిల్ ఇంజిరీలింగ్ లో డిప్లొమా పొందారు. మిగిలిన మాజీ ప్రధానమంత్రులందరూ డిగ్రీ లేదా పీజీ చదివిన వారే. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన వారూ ఉన్నారు. ఆప్ నేతల ఆరోపణలు ఎలా ఉన్నా, బీజేపీ నేతలు మాత్రం ప్రస్తుత ప్రధాని మోడీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేటే అని నొక్కి వక్కాణిస్తున్నారు.