దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగిన కాంగ్రెసేతర పార్టీలు, ముఖ్యంగా భాజపా నేతలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి ఇటలీ మూలాల గురించి ప్రజలకి గుర్తు చేయడం మరిచిపోరు. ప్రధాని నరేంద్ర మోడీ మొన్న కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కూడా ఆ ప్రస్తావన చేసారు. ఈసారి ఆమె కూడా నేరుగా, చాలా ఘాటుగానే జావాబివ్వడం విశేషం.
ఆమె నిన్న రాత్రి తిరువనంతపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, తను ఇటలీలో పుట్టిన మాట వాస్తవమని, వృద్దురాలయిన తన తల్లి, ఇద్దరు సోదరిలు అక్కడే ఉన్నారని, అయినా తను భారత్ నే తన స్వంత ఇల్లుగా భావిస్తున్నానని, తను ఇక్కడే జీవించి ఇక్కడ మరణిస్తానని, తన అస్థికలు ఇక్కడే గంగలో కలుస్తాయని ఆమె చెప్పారు. తను రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకొని భారత్ వచ్చి ఇప్పటికి 48 ఏళ్ళు అవుతోందని అయినా మోడీ వంటివాళ్ళు తమ రాజకీయ ప్రయోజనాల కోసం తనను విదేశీయురాలిగా చూపించే ప్రయత్నాలు మానుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. మోడీ తదితరులు తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, భారత్ పట్ల తన ప్రేమాభిమానాలను వాళ్ళు మార్చలేరని ఆ విషయం దేశ ప్రజలకి కూడా తెలుసని ఆమె అన్నారు.
సోనియా గాంధీ విదేశీమూలాలను ప్రశ్నిస్తే అది ఆమె బలహీనతపై దెబ్బ తీయడమేనని మోడీ లేదా మరొకరు అనుకొంటారు కానీ నిజానికి అది వారి బలహీనతగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మహిళని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఆమె విదేశీ మూలాల గురించి ప్రశ్నిస్తున్నారని భావించాల్సి ఉంటుంది. సోనియా గాంధీ విదేశీ మూలాలు అనేవి ఆమె వ్యక్తిగతమయిన విషయం. దానికీ ఆమె నేతృత్వంలో యూపియే హయంలో జరిగిన పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, రాష్ట్ర విభజన వంటి రాజకీయ నిర్ణయాలు వగైరాలతో సంబందం లేదు. కనుక భాజపా విమర్శలు, పోరాటం ఆమె అవినీతిపైనే చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు.
ప్రస్తుతం మోడీ చేతిలోనే సర్వాధికారాలున్నాయి కనుక, అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణంతో సహా యూపియే హయంలో జరిగిన అన్ని కుంభకోణాలపై విచారణ జరిపించి చట్ట ప్రకారం దోషులను శిక్షింపజేయవచ్చు. సోనియా గాంధీ కూడా తమ అవినీతిని నిరూపించామని మోడీకి సవాలు విసిరారు. కానీ ఆమె సవాలుని స్వీకరించి, ఆ కేసులపై దర్యాప్తుని వేగవంతం చేయకుండా ఆమె విదేశీ మూలాల గురించి మాట్లాడటం ఆయన బలహీనతగానే చూడవలసి ఉంటుంది లేదా ప్రజలను ఆకట్టుకొని ఓట్లు వేయించుకోవడం కోసమేనని భావించాల్సి ఉంటుంది.