కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మే 10,11 తేదీలలో పుదుచ్చేరి, తమిళనాడులో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనవలసి ఉంది. కానీ జ్వరం కారణంగా రెండు రోజులు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించడంతో ఎన్నికల ప్రచారానికి రాలేకపోతున్నట్లు రాహుల్ గాంధీ ట్వీటర్ లో మెసేజ్ పెట్టారు. “ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ అందరినీ కలవాలనుకొన్నాను కానీ జ్వరం కారణంగా కలవలేకపోతున్నాను. అందుకు ప్రజలకి క్షమాపణలు చెపుతున్నాను. మళ్ళీ త్వరలోనే నా పర్యటన వివరాలను వెల్లడిస్తాను,” అని మరో ట్వీట్ చేసారు.
పుదుచ్చేరిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నిన్న (సోమవారం) గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వి నారాయణ స్వామి పుదుచ్చేరిలో అడుగుపెడితే వారిపై దాడి చేస్తామని హెచ్చరిక ఉంది. డిల్లీలోని కాంగ్రెస్ నేతలు తక్షణమే కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసి ఈ విషయం తెలియజేసి రాహుల్ గాంధీ, నారాయణ స్వామిలకు తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసారు. ఆయన సానుకూలంగా స్పందించి, వారి రక్షణ కొరకు తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షికి ఆదేశాలు జారీ చేసారు. ఆయన , ఇంటలిజన్స్ బ్యూరో, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసారు. వారు రాహుల్ గాంధీకి కట్టుదిట్టమయిన భద్రతా ఏర్పాట్లు అన్నీ చేసారు. కానీ అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరువాత రాహుల్ గాంధీ తనకు జ్వరం వచ్చిందని చెప్పడంతో సహజంగానే అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ బెదిరింపు లేఖని చూసే రాహుల్ గాంధీ జ్వరం తెచ్చేసుకొన్నారని జోకులు పేలుతున్నాయి.