ఉత్తరాఖండ్ లో నాటకీయ పరిణామాల మధ్య బలపరీక్ష మంగళవారం ముగిసింది. సీల్డ్ కవర్లో వివరాలు సుప్రీం కోర్టుకు బుధవారం చేరబోతున్నాయి. అయితే, తామే గెలిచామని కాంగ్రెస్ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. చేతులెత్తడం ద్వారా ఓటింగ్ జరిగిందని, హరీష్ రావత్ తీర్మానం నెగ్గిందని ఒక బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీ బయట మీడియాతో చెప్పడం విశేషం. అయితే అధికారికంగా ఫలితాన్ని ప్రకటించే ప్రక్రియ బుధవారం జరుగుతుంది.
తొమ్మిది మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ స్కెచ్ వేసింది. తద్వారా తానే అధికారంలోకి రావాలని భావించింది. ఈలోగా రెబెల్స్ పై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో రాజకీయం రసకందాయంలో పడింది. పరిస్థితి తమ చేయిదాటిపోతోందని బీజేపీకి అర్థమైంది. అప్పుడు మరో అంకం మొదలైంది. రాష్ట్రంలో పరిపాలన సజావుగా సాగే అవకాశం లేదని గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపారు. దీంతో కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసింది. దీన్ని రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా మార్చి 27 నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.
అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన ఇవ్వడం రాజకీయంగా దుమారం రేపింది. కేంద్రం తీవ్ర విమర్శల పాలైంది. బీజేపీపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. చివరకు సుప్రీం కోర్టు తీర్పు, రెబెల్స్ ఓటింగ్ పై హైకోర్టు తీర్పు తర్వాత బలపరీక్ష జరిగింది.
బుధవారం నుంచి మళ్లీ హరీష్ రావత్ ప్రభుత్వం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే, వీలైనంత త్వరగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్రజాస్వామికంగా రాష్ట్రపతి పాలన విధించిన కేంద్రాన్ని, బీజేపీని ఇరుకున పెట్టాలంటే ముందస్తు ఎన్నికలే మార్గమని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో పాటు హరీష్ రావత్ భావిస్తున్నారట. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దెబ్బకొట్టాలి. వేడి వేడి వాతావరణం అనుకూలంగా కనిపిస్తున్నప్పుడే ఎన్నికలకు వెళ్లాలనే సంగతి రాజకీయ నాయకులు బాగా తెలుసు.
మామూలుగా అయితే వచ్చే ఏడాది మార్చి మొదటి వారంకల్లా ఉత్తరాఖండ్ లో కొత్త అసెంబ్లీ ఏర్పడాలి. కాబట్టి ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అంటే మరో 10 నెలలు. అప్పటికి ఈ రాష్ట్రపతి పాలన వేడి చల్లారుతుందేమో అని కాంగ్రెస్ అనుమానం. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే చర్చ మొదలైనట్టు తెలుస్తోంది. వీలైతే జూన్ లేదా జులైలో ఎన్నికలు జరిగేలా అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయాలనే ఒక యోచన ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా ముందుకు వెళ్లాలని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంతో పాటు, బీజేపీపై తీవ్ర విమర్శలు చేయడం ద్వారా పైచేయి సాధించాలనేది కాంగ్రెస్ స్కెచ్. సాధారణంగా ఎన్నికల్లో అధికార పార్టీపై విమర్శల దాడి జరుగుతుంది. ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్తే బీజేపీమీదే దాడి చేయవచ్చని కాంగ్రెస్ భావిస్తోందట. ఇదే జరిగితే బీజేపీపై ఇది తాము ప్రయోగించే బ్రహ్మాస్త్రం అవుతుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అయితే ఈ అప్షన్ ను వెంటనే ఉపయోగించుకుంటారా లేక కొంత కాలం ఆగుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. సోనియా, రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.