బీహార్లో లాలు, నితీష్ పాలన వస్తే జంగల్ మళ్లీ వస్తుందన్న బీజేపీ ఆరోపణలే నిజమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. లాలును విమర్శించారుగానీ నితీష్ కూడా తక్కువేం కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గయ పట్టణంలో తన కారును ఓవర్ చేసిన పాపానికి ఓ యువకుడిని అధికార జేడీయూ ఎం ఎల్ సి మనోరమ దేవి కొడుకు వెంటాడి మరీ కాల్చి చంపాడు. నితీష్ పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉందో, అధికార మదంతో ఏమైనా చేయవచ్ననే సంస్కృతి ఎంతగా ప్రబలిందో చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ.
అధికార పార్టీ ఎం ఎల్ సి కొడుకు కారును ఎవరూ ఓవర్ టేక్ చేయవద్దా. ఈ చిన్న కారణానికి చంపడానికి తెగించడాంటే బీహార్ అధికార పార్టీ ఏ దిశలో పయనిస్తుందో అర్థమవుతుంది. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటమే లక్షణాన్ని నితీష్ తన పార్టీ వారికి చెప్పలేదని, వారి ఇష్టారాజ్యాన్ని చూసీ చూడనట్టు వ్యవహరించడానికి రెడీ ఉన్నారని అర్థమవుతుంది.
బీహార్ లో జేడీయూ, ఆర్జేడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హింస పెరిగిందనే విమర్శలున్నాయి. రాజకీయ నాయకుల ఇష్టారాజ్యం పెరిగిందని చాలా మంది చెప్తున్నారు. తమ కొడుకు గూండారాజకీయం చంపేసిందని ఎం ఎల్ సి కొడుకు చేతిలో మరణించిన యువకుడి తండ్రి ఆక్రోశిస్తున్నారు. ఇంకోసారి ఏ రాజకీయ నాయకుడి కొడుకూ బరితెగించడానికి భయపడేలా ఈ నిందితుడికి శిక్ష విధించాలని కోరుతున్నారు.
తమ పార్టీ నాయకురాలి కొడుకు ఇంత ఘాతుకానికి ఒడిగట్టినా నితీష్ ముఖంలో చిరునవ్వు చెరగలేదు. చురుగ్గా దర్యాప్తు చేయిస్తున్నామని మీడియా సమావేశం పెట్టినప్పుడు కూడా ఆయన ముఖంలో బాధ ఛాయలే కనిపించలేదు. ప్రతిపక్షాలకు విమర్శించడం అలవాటేనంటూ ఎదురు దాడిచేశారు. అంతేగానీ హత్యకు గురైన తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకున్న నాయకుడు నితీష్ లో కనిపించలేదు.
మీడియా కోడై కూసిన తర్వాత, బీజేపీ తీవ్రంగా ఆందోళనకు దిగిన తర్వాత, రాష్ట్రంలో, దేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అర్థమైన తర్వాత, నితీష్ ప్రభుత్వంలో కాస్త చలనం వచ్చింది. మూడు రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు రాకీని పోలీసులు అరెస్టు చేశారు. నేనెరుగ నేనేరుగ అంటూ తన కొడుకు జాడ గురించి తన పార్టీ ఎం ఎల్ సి చెప్పకపోతే పార్టీ అధ్యక్షుడిగా నితీష్ సీరియస్ గా తీసుకోలేదు. ఎం ఎల్ సికి, ఆమె భర్తకు చెందిన ఫ్యాక్టరీలోనే ఆమె సుపుత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. బుద్ధగయ ఫ్యాక్టరీలో అరెస్టు చేశామని స్వయంగా ఎస్ ఎస్ పి మీడియాకు చెప్పారు.
మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నితీష్ లో చాలా మార్పు కనిపిస్తోంది. నరేంద్ర మోడీ లా తాను కూడా ప్రధాన మంత్రి కావాలని భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అందులో తప్పేమీ లేదు. అయితే రాష్ట్రంలో ఆయన పరిపాలన తీరే విమర్శల పాలవుతోంది. ఇలాగే ఉంటే ముందు ముందు ప్రధాని పదవి దక్కడం కాదు, ఉన్న ముఖ్యమంత్రి పదవి దూరమవుందేమో!