ప్రత్యేక హోదా కోరుతూ ఇవ్వాళ్ళ వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసింది. జగన్మోహన్ రెడ్డి కాకినాడలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు విమర్శించడం మామూలే. అది ఏవిధంగా, ఏ స్థాయిలో ఉంటుందో కూడా అందరికీ తెలుసు. అందులో కొత్తగా చెప్పుకోవలసినదేదీ లేదు.
జగన్మోహన్ రెడ్డి పోరాటాల వెనుక ఉద్దేశ్యాలు ఏవయినప్పటికీ, ఆ వంకతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడమే ఆయనకు అలవాటుగా మారింది. ఆయన ఎండనకా వాననకా ఇలాగ పనిగట్టుకొని ధర్నాలు, దీక్షలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తున్నా కూడా తెదేపా జవాబు చెప్పుకోలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ప్రత్యేక హోదా తదితర హామీల అమలుకోసం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదని, ఓటుకి నోటు కేసుకు భయపడి తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదని జగన్ పదేపదే ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలని తెదేపా చాలా తేలికగా కొట్టి పడేసి, జగన్ పై ఎదురు దాడి చేసి అక్కడితో ఆ సమస్య పరిష్కారం అయిపోయినట్లు భావిస్తుంటుంది. ఎందుకంటే జగన్ పై సిబిఐ కేసులు ఉన్నాయి కనుక ఆయన చేస్తున్న ఆ ఆరోపణలు ప్రజలు నమ్మబోరని తెదేపా నేతలు ఆత్మవంచన చేసు కొంటుంటారు. కానీ అది రాజకీయంగా ఆత్మహత్య చేసుకోవడమే అవుతుందని మున్ముందు గ్రహించినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు.
జగన్ పదేపదే చేస్తున్న ఆ ఆరోపణలు ప్రజలను ఆలోచింపజేయకుండా ఉంటాయా? ఆయన చేస్తున్న ఆరోపణలలో నమ్మలేనివి ఏమయినా ఉన్నాయా అంటే లేవని తెదేపాకు, ప్రజలకు కూడా తెలుసు. జగన్ చేస్తున్న ఆ ఆరోపణల వలన ప్రజలలో తెదేపా ప్రభుత్వంపై అనుమానం, అసంతృప్తి, ఆగ్రహం పెరిగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే వచ్చే ఎన్నికలలో తెదేపా అందుకు బారీ మూల్యం చెల్లించక తప్పదు.కనుక ఇకనయినా తెదేపా ప్రభుత్వం మేల్కొని ఈ సమస్యల పరిష్కారం, హామీల అమలు గురించి తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది.