తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభంజనాన్ని ఎదుర్కోవాలంటే విపక్ష పార్టీలు విడివిడిగా పోరాడడం వల్ల ఉపయోగం ఉండదని వారికి ఇన్నాళ్లకు అర్థమైనట్లు కనిపిస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాలను రోజురోజుకూ బలహీన పరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడుగా దూసుకుపోతుండగా.. మరోవైపు బలహీనపడుతున్న తామందరమూ కలిసి ఒక్కటిగా తయారైతేనే ఎంతోకొంత బలం సమకూరుతుందనే ఉద్దేశానికి వారు వస్తున్నట్లుంది. అందుకే కాంగ్రెస్, తెదేపాలు మిలాఖత్ అయి కేసీఆర్ మీద పోరు ప్రకటన చేస్తున్నట్లుగా తాజా పరిణామాలు సంకేతాలు ఇస్తున్నాయి. పాలేరు ఉప ఎన్నికలో తెలుగుదేశం పోటీకి దిగకుండా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి సిద్ధం కావడం ఒకటో ఉదాహరణ అయితే.. ఇవాళ రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) పనుల పూర్తికోసం ఎమ్మెల్యే సంపత్ చేపట్టిన మహాదీక్ష శిబిరంలో అందరూ కాంగ్రెస్ కండువాల మధ్యలో పసుపు కండువాతో మెరిసిపోతూ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి వారికి మద్దతు ఇవ్వడం విశేషం.
సంపత్ చేసిన దీక్షను, దానికి రేవంత్ ప్రకటించిన మద్దతును తెరాసకు చెందిన నాయకులు ఎంతటి పరుష పదజాలంతో అయినా తూలనాడవచ్చు గాక… కానీ ఈ ఉద్యమంలో రెండు పార్టీలు కలిసి ప్రభుత్వంపై పోరాడదలచుకున్నాయనే ప్రధానమైన సంకేతం ఉంది. ఇన్నాళ్లూ పరిస్థితి వేరు. పార్టీలు ఎవరికి వారు ఉద్యమిస్తూ వచ్చారు. ఇప్పుడు పార్టీలే బలహీన పడగా.. కలిసి పోరాడడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రజా ఉద్యమాల విషయంలో కాంగ్రెస్తో కలిసి అయినా సరే.. కేసీఆర్ సర్కారుకు కంటి మీద కునుకు లేకుండా చేయడానికే తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే వాస్తవాలు ఎంతమేరకో తెలియకపోయినప్పటికీ.. రాజకీయ వర్గాల్లో మరో రకం పుకారు కూడా వినిపిస్తోంది. అసలే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా ఖాళీ అవుతున్నది. ఆర్.కృష్ణయ్యను లెక్కల్లోంచి తీసేస్తే మిగిలిన ఇద్దరిలో ఒకరు సండ్ర వెంకటవీరయ్య గులాబీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక పోయేవాళ్లందరూ పోగా.. తానొక్కడూ ఉండి మాత్రం చేసేదేముంది లెమ్మని రేవంత్రెడ్డి ఫిక్సయి ఉంటారని.. ఎటూ కేసీఆర్ పంచకు చేరే అవకాశం తనకు లేదు గనుక.. ఆయన నెమ్మదిగా కాంగ్రెస్ దిశగా పావులు కదుపుతున్నాడేమోనని కూడా కొందరు గుసగుసలాడుకుంటున్నారు.