వ్యవస్థను మార్చండని సుప్రీంకోర్టు చెప్తే, అది నావల్ల కాదంటూ రాజీనామా చేశాడు బీసీసీఐ చైర్మన్ శశాంక్ మనోహర్. మార్పు మంచిది కాదనే ధోరణిలో బోర్డు పెద్దలు వితండ వాదన చేయడాన్ని అనేకసార్లు సుప్రీం కోర్టు తప్పు పట్టింది. అయినా, పారదర్శక పాలనకు బోర్డు ఒప్పుకోవడం లేదు.
భారతీయ క్రికెట్ లో సంస్కరణలు చేయాలంటూ ప్రత్యేక కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయడానికి బోర్డు పెద్దలు ససేమిరా సిద్ధంగా లేరు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఫ్యూడల్ తరహా పాలన సాగించడం బీసీసీఐ మానుకోవాలని ఇప్పటికే చాలాసార్లు సుప్రీం కోర్టు సూచించింది. మీ పనితీరు సరిగాలేదంటూ మందలించింది. అనేకసార్లు మొట్టికాయలు వేసింది. అయినా బోర్డు పెద్దల బుద్ధి మారలేదు.
వేలకోట్ల ఆదాయం ఉన్న బీసీసీఐలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. ఐపీఎల్ మొదలు కాకముందు దీనికి ఆదాయ పన్ను మినహాయింపు కూడా ఉండేది. అయినా ఇది సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాలేదు. ఇప్పటికీ దాని పరిధిలోకి రావడానికి సిద్ధంగా లేదు. అంతే ఏదో గోల్ మాల్ జరుగుతోందనే అనుమానాలు కలగడం సహజం.
సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అనేక సూచనలు చేసింది. బీసీసీఐ ఎన్నికల్లో ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలని చెప్పింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని మూడు సంఘాలకూ ఓటు హక్కు ఉంది. ఇక ముందు అలా ఉంకూడదని చెప్పింది. పారదర్శకంగా ఆడిటింగ్ జరగాలని సూచించింది. కాగ్ సిఫార్సు చేసిన ఆడిటర్ ను బీసీసీఐ కార్యవర్గంలో చేర్చాలనేది మరో ప్రతిపాదన. అలా అయితే లెక్కల గోల్ మాల్ జరిగిందా లేదా అనేది బయటపడే అవకాశం ఉంటుంది.
బోర్డులో రాజకీయ నాయకులు, మంత్రులు, ఉన్నతాధికారులు ఎందుని సుప్రీంకోర్టు చాలాసార్లు ప్రశ్నించింది. అయినా బీసీసీఐ సంస్కరణలకు ససేమిరా అంటోంది. మార్పు, పారదర్శకత జాన్తానై అని మొండికేసింది. అలాంటప్పుడు బోర్డును ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోకూడదని సుప్రీంకోర్టు ఇటీవల ప్రశ్నించింది. అయినా బోర్డు నుంచి ఉలుకూ పలుకూ లేదు. పరిస్థితి విషమిస్తోందని శశాంక్ మోహన్ కు అర్థమైనట్టుంది. తనహయాంలో మంచి మార్పులు జరుగుతాయేమో అని ఆయన భయపడ్డారో ఏమో. హటాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు.
దాహార్తిలో అలమటించే ప్రజలకంటే ఆటతో వచ్చే ఆదాయమే ముఖ్యమని దబాయించిన ఘన చరిత్ర బీసీసీఐ పెద్దలది. అలాంటి వారిలో మార్పువస్తుందని ఆశించడం సరికాదేమో. ఏదిఏమైనా పారదర్శకతకు అంగీకరించేది లేదని వారంటున్నారు. కాగ్ సూచించిన ఆడిటర్ ను నియమిస్తే తమ అక్రమాల బాగోతాలు బయటపడతాయని వాళ్లు భయపడుతున్నారేమో తెలియదు. ఒకవేళ అలాంటిదేం లేకపోతే అభ్యంతరం ఏమిటి? సుప్రీం కోర్టు కూడా ఈ విషయం ప్రశ్నించింది. చివరకు ఈ అనుమానాస్పద, డబ్బు కక్కుర్తి బోర్డు కార్యవర్గాన్ని రద్దుచేసి, కేంద్రం స్వాధీనం చేసుకోవడం మంచిదేమో. చాలా మంది ఇలాగే అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఆ పరిస్థితి వస్తుందో, లేక ఈ వ్యవహారం మరో మలుపు తిరుగుతుందో చూద్దాం.