జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రత్యేక హోదా కోసం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు ధర్నాలు చేసారు. వారిలో కావలి వైకాపా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. ఆ సందర్భంగా అయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. అందులో పెద్ద విచిత్రమేమీ లేదు. కానీ ఆయన మే8న మంత్రి నారాయణతో రహస్యంగా సమావేశమయ్యి తెదేపా చేరేందుకు అన్నీ మాట్లాడుకొని, మే 18న చేరాలని ముహూర్తం కూడా ఖరారు చేసుకొన్న తరువాతే, ఈ ధర్నాలలో పాల్గొని చంద్రబాబు నాయుడుని విమర్శించడం విశేషం. ఆయన ధర్నాలో పాల్గొని ముఖ్యమంత్రిని విమర్శించినా మే 18న తప్పకుండా తెదేపాలో చేరడానికే నిశ్చయించుకొన్నట్లు సమాచారం. వైకాపాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని విమర్శించిన వైకాపా నేతలు, తెదేపాలో చేరేటప్పుడు అదే ముఖ్యమంత్రి సమర్ధమయిన పరిపాలన చూసి, ఆయన వల్ల మాత్రమే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి పార్టీలో చేరుతున్నామని చెప్పగలగడం విస్మయం కలిగిస్తుంది. బహుశః రామిరెడ్డి కూడా అదే పాట పాడుతారేమో?