తెరాసలో ఒక పద్ధతి ప్రకారం అంచెలంచెలుగా ఎదుగుతున్న వ్యక్తి ఎవరయినా ఉన్నారా? అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అని అందరికీ తెలుసు. తెరాసలో ఈటెల, హరీష్ రావు, నాయిని వంటి అతిరధ మహారధులు చాలా మంది ఉన్నప్పటికీ, ఈ రెండేళ్ళలో వారందరూ తమ ప్రాధాన్యం కోల్పోయి తెర వెనుకకు వెళ్లిపోవడం, వారందరికి బదులుగా మంత్రి కేటీఆర్ తెరాస ‘ఐకాన్’ గా తెర ముందుకు రావడం అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీకి, పదవికి కేటీఆర్ ని వారసుడుగా తీర్చిదిద్దుతున్నారని అర్ధమవుతూనే ఉంది. మున్ముందు పార్టీలో, ప్రభుత్వంలో చివరికి రాష్ట్రంలో ప్రతిపక్షాల నుంచి కూడా తన కొడుకుకి ఎటువంటి సవాళ్లు ఎదురవకూడదనే ఆలోచనతో కేసీఆర్ అమలు చేస్తున్న రకరకాల వ్యూహాలను అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కానీ కేటీఆర్ తనకు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక లేదని, వారసత్వ రాజకీయాలను సమర్ధించనని, ముఖ్యమంత్రి కొడుకో, కూతురో అయినంత మాత్రాన్న తమకు పదవులు కావాలని కోరడానికి అవేమీ చాక్లెట్లు, పిప్పర్మెంట్లు కావని చెప్పడం విశేషం. ఆయన ఒక ప్రముక టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఇది చెప్పారు.
“నేను ముఖ్యమంత్రి కావాలని ఏనాడూ ఆశ పడలేదు. పడను కూడా. కానీ నా తండ్రి కేసీఆర్ గారే మరో 15ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకొంటున్నాను. నా స్థాయికి ఈ మంత్రి పదవి దక్కడమే చాలా ఎక్కువని ఎప్పుడో చెప్పాను. రాజకీయాల్లో వయసును బట్టి పదవులు రావు. ఏదో ఒక సందర్భాన్ని బట్టి, అదృష్టం వలన మాత్రమే వ్యక్తులకు మంత్రి పదవులు దక్కుతుంటాయి. ప్రజలు ఆమోదించినవారే పదవులలో కొనసాగుతారు,” అని అన్నారు.
ఆయన ఇంకా మరి కొన్ని విషయాల గురించి కూడా మాట్లాడారు. కానీ కేవలం వారసత్వం కారణంగానే మంత్రి పదవి దక్కించుకొని వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తానని చెప్పడం, మళ్ళీ ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదని, తన తండ్రే మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. తెరాసలో వారసత్వ రాజకీయాలు ఉద్యమ సమయంలోనే మోదలయ్యాయని అందరికీ తెలుసు. అప్పటి నుంచి నేటికీ…ఏనాటికీ అవి కొనసాగుతూనే ఉంటాయని ప్రస్తుత పరిణామాలన్నీ కళ్ళకు కట్టినట్లు చూపుతుంటే, అటువంటిదేమీ లేదన్నట్లు కేటీఆర్ మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు నలుగురూ కూడా చాలా సమర్దులయిన రాజకీయ నేతలే. ఆ విషయంలో ఎవరికీ భినాభిప్రాయలు లేవు. కనుక తమకి పదవులు లభించడానికి వారసత్వమే పునాది అయినప్పటికీ, ఆ తరువాత తమ సమర్ధతతో వాటికి తాము అన్ని విధాల అర్హులమని నిరూపించుకొన్నామని, సమర్ధులం కనుకనే ఇంకా ఉన్నత పదవులు ఆశిస్తే తప్పు లేదని కేటీఆర్ చెప్పుకొంటే చాలా హుందాగా ఉండేది. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలలో ఈ వారసత్వ రాజకీయాలకు అతీతంగా ఉన్నవాటిని వ్రేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఉన్న చాలా రాజకీయ పార్టీలలో వారసత్వం చాలా సర్వ సాధారణ విషయమే. దానికి తెరాస కూడా అతీతం కాదని అందరికీ తెలుసు.