భారత్ లో 17 బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టేసి లండన్ పారిపోయిన విజయ మాల్యాని త్రిప్పి పంపాలనే భారత ప్రభుత్వ అభ్యర్ధనను బ్రిటన్ ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. తమ దేశ చట్టాల ప్రకారం ఆయనను బలవంతంగా త్రిప్పి పంపడం సాధ్యం కాదని, కానీ ఆయనను వెనక్కి రప్పించేందుకు భారత్ కి అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పింది.
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “విజయ మాల్యా పాస్ పోర్ట్ రద్దయినప్పటికీ బ్రిటన్ చట్టాల ప్రకారం ఆయన లండన్ నివసించేందుకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఆయనపై మోపబడిన నేరారోపణల తీవ్రతను బ్రిటన్ ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆయనని భారత్ తిరిగి రప్పించాలంటే, బ్రిటన్ తో కలిసి భారత్ ఆయనపై న్యాయపరంగా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అందుకు భారత్ కి అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది,” అని తెలిపారు.
అంటే ఆయనను భారత్ రప్పించేందుకు బ్రిటన్ న్యాయస్థానంలో కూడా న్యాయపోరాటం చేయాలని సూచిస్తోందని అర్ధమవుతోంది. అదే జరిగితే ఇప్పట్లో ఆయనను వెనక్కి రప్పించే అవకాశం లేనట్లే భావించవచ్చు. ఎందుకంటే బ్రిటన్ లో మళ్ళీ న్యాయపోరాటం మొదలుపెడితే దానిని విజయ మాల్యా ఎన్నేళ్ళయినా నడిపించగల సమర్ధుడు కనుక.