ఓ సినిమాకి సంబంధించి పుస్తకం రావడం అరుదైన విషయమే. సాదారణంగా క్లాసిక్ సినిమాలపై అలాంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఫ్లాప్ సినిమాల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అయితే ఛార్మి జ్యోతిలక్ష్మిపై ఇప్పుడో పుస్తకం వచ్చింది.
మంగళగౌరి అనే రచయిత్రి ఈ పుస్తకం రాశారు. ఈరోజు హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో ఈ పుస్తకాన్ని ఛార్మి ఆవిష్కరించింది. ”ఛార్మి గత జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటుంది. అందుకే తను నటించిన ఈసినిమాపై ఓ పుస్తకం వచ్చింది” అంటూ పూరి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఛార్మి మనసులోని మాట కూడా అదే. ”జ్యోతిలక్ష్మి సినిమాని నేనెప్పటికీ మర్చిపోను. బయటకు వెళ్తే నన్ను జ్యోతిలక్ష్మి అంటూ పిలుస్తున్నారు. ఈ సినిమాపై పుస్తకం రావడం నా అదృష్టం. నాకు తెలుగు రాదు.. కానీ ఎవరితో అయినా ఈ పుస్తకాన్ని చదివించుకొంటా” అంటోంది.
ఓ సినిమాపై పుస్తకం రాసే విషయంలో ఎవ్వరికీ అభ్యంతరాలు లేకపోవొచ్చు. అయితే రచయిత్రి ఈసినిమాని ఓ శంకరాభరణంతోనూ, అందులో ఛార్మిని కన్యాశుల్కంలోని మధురవాణి పాత్రతో బేరీజు వేయడం మాత్రం సినీ, సాహితీ అభిమానులకు అంతగా రుచించకపోవొచ్చు. సినిమా విడుదలై.. మర్చిపోతున్న తరుణంలో ఈపుస్తకం రావడం కూడా ఆశ్చర్యకరమే. మరి ఈ పుస్తకమైనా హిట్ అవుతుందంటారా?