ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరి స్పష్టం చేయడంతో రాష్ట్రంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోలేక చాలా ఇబ్బందిపడుతున్న తెదేపా, కేంద్రం పట్ల ఇకపై కొంచెం కటువుగానే వ్యవహరించదలచుకొన్నట్లు ఉంది. ఆ పార్టీ ఎంపి సి.ఎం.రమేష్ నేడు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీల అమలు గురించి చాలా గట్టిగా నిలదీయడం గమనిస్తే అది అర్ధమవుతుంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఏవిధంగా ప్రత్యేక హోదా ఇచ్చారో అదేవిధంగా ఏపికి కూడా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదు కనుక ఇవ్వలేమని చెపుతున్నప్పుడు, ఆ చట్టంలో హామీ ఇచ్చిన రైల్వే జోన్ ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. రెండేళ్ళయినా ఇంకా రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం సాగదీస్తూ కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర విభజన కారణంగా అన్ని విధాల నష్టపోయి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదికోవలసిన బాధ్యత కేంద్రానిదేనని గుర్తు చేసారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని దాని నిర్మాణానికి అవసరమయిన నిధులు కేంద్రం విడుదల చేయాలని కోరారు.
రమేష్ లేవనెత్తుతున్న సమస్యలన్నీ కేంద్రానికి కూడా తెలుసు. వాటికి ఇప్పటికే చాలాసార్లు సమాధానం చెప్పి, వాటిపై తన వైఖరి ఏమిటో కూడా స్పష్టం చేసింది. కనుక తెదేపా ఎంపిలు ఎన్నిసార్లు అడిగినా, మళ్ళీ అవే సమాధానాలు వస్తాయి తప్ప కొత్తగా చెప్పేవి ఏమీ ఉండవు. కనుక తెదేపాకు నిజంగానే వాటిని సాధించుకోవాలనే తపన, పట్టుదల ఉన్నట్లయితే వాటిని రాజకీయంగానే పరిష్కరించవలసి ఉంటుంది. ఇప్పటికే రెండేళ్ళు గడిచిపోయాయి. ఇంకా ఇలాగే కాలక్షేపం చేస్తుంటే ప్రజలను, ప్రతిపక్షాలను మభ్య పెట్టడానికే ఇటువంటి నాటకాలు ఆడుతోందని ప్రజలు కూడా అనుమానించే పరిస్థితి తప్పకుండా వస్తుందని గ్రహించాలి. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. కనుక చేతులు కాలక మునుపే మేల్కొనడం మంచిది కదా.