ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో తలదూర్చి భారతీయ జనతా పార్టీ తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆ పార్టీ తలదించుకోవాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టింది.
‘పదవీచ్యుతుడైన’ ముఖ్యమంత్రి పదవి నుంచి గవర్నర్ తొలగించిన హరీష్‌రావత్ మంగళవారం జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. అసెంబ్లీలో ఆయన మెజారిటీ నిరూపించుకున్నట్టు సుప్రీంకోర్టు బుధవారం అధికారికంగా ప్రకటించింది. కేంద్రం తరఫున మంగళవారం అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరైన అటార్నీ జనరల్ ఉత్తరాఖండ్ అసెంబ్లీలో హరీష్ మెజారిటీ నిరూపించుకున్నట్టు తెలియజేశారు. ప్రస్తుతం అక్కడ అమలులో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తామని కూడా కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం తరఫు వాదన విన్న అత్యున్నత న్యాయస్థానం హరీష్ రావత్ బలపరీక్షలో నెగ్గినట్టు అధికారికంగా ప్రకటిస్తూ… ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టవచ్చంటూ స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు..సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే మంగళవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష జరిగింది. హరీష్‌కు అనుకూలంగా 33, వ్యతిరేకంగా 28 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ వివరాలను సీల్టు కవరులో సుప్రీంకోర్టుకు సమర్పించగా ఈరోజు ఫలితాలను సుప్రీంకోర్టు స్వయంగా ప్రకటించింది.
ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనేది కేంద్ర మంత్రి వర్గ నిర్ణయమే అయినా భారత రాష్ట్రపతి పేరుతో ఆదేశాలు జారీ చేసినందున ఆ అప్రతిష్ట దేశ ప్రధమ పౌరుడికి కూడా అంటుకుంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడటానికి కాంగ్రెస్ అధిష్టానవర్గ తప్పిదం ఉంది. ముఖ్యమంత్రి హరీష్‌రావత్ తమను కలుపుకుని వెళ్లడంలేదని తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని తమ రాజకీయానికి అనుకూలంగా మలచుకోవాలని బిజెపి తాపత్రయపడింది. కాంగ్రెస్‌లో తిరుగుబాటు ఎమ్మెల్యేలను మరింత రెచ్చగొట్టిన బిజెపి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు పథకం పన్నింది.
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేసి ప్రతిపక్ష బిజెపితో చేతులు కలపడంతో కథ మొదలైంది. మొత్తం 70 మంది శాసన సభ్యులున్న ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 36 మంది మద్దతు ఉండేది. ఈ తిరుగుబాటుతో శాసనసభలో కాంగ్రెస్ బలం 27కు చేరింది. దీనికి తోడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా రంటూ మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సస్పెండ్ చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 25కు పడిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు లేదని అందువల్ల రావత్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి తమకు అవకాశం ఇవ్వాలని బిజెపి, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరడం మొదలు పెట్టారు. ఈ గొడవల మధ్య శాసనభలో బలం నిరూపించుకునేందుకు హరీష్‌రావత్‌కు గడువు ఇస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ కెకె పౌల్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ లోపునే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎదుటకు ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ బిల్లు ఆమోదిస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయించుకున్న నిధులు ఖర్చు చేయడానికి వీలుండదు. అందుకోసం ద్రవ్యవినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లుపై ఓటింగ్ జరపాలని ప్రతిపక్ష బిజెపి డిమాండ్ చేసింది. అయితే బిల్లు ఆమోదం పొంద డం ముఖ్యమని భావించిన ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గోవింద్ సింగ్ ముజువాణి ఓటుతో దాన్ని ఆమోదించినట్లు ప్రకటించారు.
హరీష్‌రావత్‌కు అసెంబ్లీలో బలం లేనందునే మూజువాణి ఓటుతో బిల్లును నెగ్గించుకున్నారని బిజెపి ఆరోపించింది. ఇది జరిగిన ఆరు రోజుల తర్వాత రావత్ ప్రభుత్వాన్ని కూల్చివేసి కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. రావత్ బలనిరూపణకు కొన్ని గంటల ముందు రాష్ట్రపతి పాలన విధించడమే అందరికి అనుమానం కలిగించింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందు కు మొదటి నుంచీ కేంద్రంలోని బిజెపి సర్కార్ కుట్ర పన్నుతూనే ఉందని రావత్ ఆరోపించారు.
అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేయడంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని, దరిమిలా రాష్ట్రపతి పాలన విధించక తప్పని పరిస్థితి ఏర్పడిందని కేంద్రం వివరణ ఇచ్చుకుంది. కేంద్ర మంత్రి వర్గ సిఫార్సుతో రాజ్యాగంలోని 356 అధికరణ ప్రయోగానికి సంబంధించిన ప్రకటనపై రాష్టపత్రి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసేశారు. ఆయన సంతకం కాగానే హరీశ్ రావత్ ప్రభుత్వాన్ని గవర్నర్ డిస్మిస్ చేశారు. అసెంబ్లీని సస్పెన్షన్ లో ఉంచారు.
తొమ్మిది మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సహా 35మంది ఓటింగ్‌కు పట్టుబట్టినా వివాదాస్పద రీతిలో ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించి నప్పటి నుంచీ రావత్ ప్రభుత్వం అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధంగానే కొనసాగిందని కేంద్రం ప్రకటించింది. గవర్నర్ పౌల్ పంపిన నివేదికలోని కీలక అంశాల ప్రాతిపదికగానే రాష్టపత్రి పాలన విధింపునకు సిఫార్సు చేసినట్లు కేంద్రం వివరించింది.
తనకు న్యాయం చేయాలని హరీష్‌రావత్ పిటిషన్ దాఖలు చేయడంతో కధ హైకోర్టుకి వెళ్ళింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తూ రావత్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎమ్ జోసెఫ్, జస్టిస్ వీకే బిస్ట్‌తో కూడిన ధర్మాసనం మూడు రోజుల పాటు విచారించింది. 356 అధికరణ ప్రయోగంలో రాష్ట్రపతి నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం కోర్టుకు లేదని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ఈ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. మనుషులు ఎవరైనా పొరపాట్లు చేయవచ్చునని, రాష్ట్రపతి, న్యాయమూర్తులు అందుకు మినహాయింపు కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రపతి పాలనను కోర్టులు సమీక్షంచలేవని కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ వాదించగా రాచరిక పాలనలో మాదిరిగా నిర్ణయాలు తీసుకోవడం కుదరదని, రాజ్యాంగ పరిధికి లోబడే ఎవరైనా వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మీరెంత గొప్ప అయినా న్యాయం మీ కన్నా గొప్పది అని కోర్టు రాష్ట్రపతికి, కేంద్రానికి తేల్చిచెప్పింది. 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలనను వత్తిడితో అమలు చేయరాదని కోర్టు పేర్కొంది.
ఇది ఇద్దరు వ్యక్తల మధ్య సమస్య కాదని, కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న పోరు అని కోర్టు తెలిపింది. బీజేపీ రాసిన లేఖను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం సరైందికాదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై కేంద్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ఏప్రిల్ 29న బలనిరూపణకు హరీష్‌రావత్‌కు అవకాశం ఇస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై కేంద్రం సుప్రీం కోర్టుకి వెళ్ళింది. దిగువకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఖరారు చేస్తూ హరీష్ రావత్ కు బలనిరూపణ అవకాశాన్ని ఇచ్చింది.