దేశంలోని బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకు పైగా బాకీ పడి లండన్ కు చెక్కేసిన విజయ్ మాల్యాను వెనక్కి రప్పించడానికి చేసిన తొలి ప్రయత్నం విఫలమైంది. మాల్యాను వెనక్కి పంపడానికి తమ చట్టాలు ఒప్పుకోవని యూకే ప్రభుత్వం తేల్చి చెప్పింది.
యూకే చట్టాల ప్రకారం ఇప్పటికిప్పుడు మాల్యాను రప్పించే అవకాశం లేని మాట వాస్తవమే. అయితే నేరవిచారణ ఎదుర్కొంటున్న నిందితుడిగా అతడిని తమకు అప్పగించాలని కోరే అవకాశం ఉంది. ఇది జరగాలంటే, మొదట అతడిపై చార్జిషీట్ దాఖలు చేయాలి. ముంబైలో మాల్యాపై కేసుపెట్టిన ఈడీ, కోర్టులో అతడిపై చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగా, నేర విచారణ కోసం అతడిని అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. అయితే నేరుగా ప్రభుత్వమే ఇందుకు ఒప్పుకుంటుందా లేక అక్కడి కోర్టు ఇందుకు ఆదేశాలు ఇవ్వాలా అనే దానిపై భిన్నమై వాదనలు వినవస్తున్నాయి.
చార్జిషీటు దాఖలైన తర్వాత కూడా లండన్ లోన కోర్టు ద్వారానే అతడిని వెనక్కి రప్పించే ఆదేశాలు పొందాల్సి ఉందంటున్నారు. అంటే కేంద్రం యూకేలో కూడా న్యాయ పోరాటం చేయాలన్న మాట. ఇప్పటికే బ్యాంకులు మాల్యాపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాయి.
మాల్యా దేశంలో ఉన్నప్పుడే బ్యాంకులు సకాలంలో స్పందించి ఉంటే లండన్ కు పారిపోయే అవకాశం ఉండేది కాదు. నాలుగైదు ఏళ్లుగా పైసా వడ్డీ కట్టని వాడిని ఉద్దేశ పూర్వక ఎగవేతదారుగా ప్రకటించడానికే బ్యాంకులు తటపటాయించాయి. బ్యాంకులు మాల్యాకు భయపడుతున్నాయని ఆరోపణలు వచ్చినా ఫలితం లేకపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఆలస్యం మేల్కొన్నాయి. యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం వల్ల వచ్చిన సొమ్ముతో లండన్ వెళ్లిపోతానని మాల్యా చెప్పినప్పుడు కూడా బ్యాంకులు స్పందించలేదు. తీరా, తీరిగ్గా న్యాయపోరాటం మొదలు పెట్టే సమయానికి అతడు లండన్ లోని తన విలాసవంతమైన మాన్షన్ కు చేరుకున్నాడు.
కనీసం చార్జి షీటు దాఖలైన తర్వాతైనా కేంద్రం చిత్తశుద్దితో ప్రయత్నిస్తే అతడిని వెనక్కి రప్పించడానికి అవకాశం ఉంది. ఆలస్యమైనా కచ్చితంగా స్వదేశానికి రప్పించి బోనెక్కించ వచ్చని కొందరు నిపుణులు చెప్తున్నారు. మరి మోడీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందో లేదో చూడాలి.