తెలంగాణ వ్యాప్తంగా నీటి ప్రాజెక్టుల జోరు మరింతగా పెరగనుంది. వివాదాస్పదంగా కడుతున్న నీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రంనుంచి తెలంగాణ సర్కారు అనుమతులు తీసుకుంటుందో లేదో తెలియదు గానీ.. వివాదం లేకుండా కడుతున్న ప్రాజెక్టుల కోసం కేంద్రంనుంచి పుష్కలంగా నిధులు మాత్రం పుచ్చుకోనున్నది. ఈ విషయంలో కేంద్రం వద్ద సరిగ్గా రెప్రజెంట్ చేయడం ద్వారా, కేంద్రం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ లో సరైన రీతిలో ఒత్తిడి తేవడం ద్వారా తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ఒక రకంగా విజయం సాధించారనే చెప్పాలి.
సింపుల్ గా చెప్పాలంటే.. మోడీ సర్కారు గడచిన రెండేళ్లలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం ప్రాజెక్టుకు ఎంత ముష్టి విదిలించిందో ఆ నిధులకంటె, తెలంగాణలో తాము నిర్మించదలచుకున్న రాష్ట్ర స్థాయి చిన్న చిన్న ప్రాజెక్టుల కోసం ఇవాళ హరీశ్‌రావు కేంద్రంనుంచి గ్రాంటు రూపేణా సాధించిన నిధుల మొత్తం అయిదారు రెట్ల కంటె చాలా ఎక్కువ ఉన్నదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.
తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఏర్పడిన తర్వాత.. నీటి ప్రాజెక్టుల నిర్మాణం మీద విపరీతంగా ఫోకస్ పెట్టారన్న మాట వాస్తవం. తెలంగాణవ్యాప్తంగా చుక్కనీరు వృథా కాకుండా ఎక్కడి చిన్న వాగులు, వంకల మీద కూడా ప్రాజెక్టులు కట్టుకుని.. సమస్తం సమృద్ధిగా కాపాడుకోవాలన్నదే వారి లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా అంతర్రాష్ట్ర నదులైన కృష్ణా, గోదావరిలో మీద కేంద్ర అనుమతులతో నిమిత్తం లేకుండా కొన్ని వివాదాస్పద ప్రాజెక్టుల నిర్మాణం కూడా జరుగుతున్నది. అదే సమయంలో రాష్ట్రంలో మరిన్ని చిన్న ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు.
ఇలాంటి 11 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడానికి హరీశ్‌రావు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ప్రయత్నాలు ప్రారంభించి సాధించుకు వచ్చారు. దేవాదుల, భీమా, శ్రీరాంసాగర్ రెండోదశ, వరదకాలువ, కమురం భీం, నీల్వాయి పెద్దవాగు, గాలివాగు, గొల్లవాగు వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. వీటికోసం కేంద్రం కేవలం గ్రాంటు రూపేణా 2155 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నది. నాబార్డు రుణంగా మరో 4631 కోట్లు కూడా ఇస్తారుట.
మొత్తానికి పోలవరం గురించి ఏపీ నేతలు హడావుడి ఎక్కువగా చేస్తూ.. కేంద్రంనుంచి నిధులు తక్కువ రాబడుతున్నారు. హరీశ్‌రావు ఎలాంటి హడావుడి లేకుండా ఎంచక్కా బోలెడు నిధులు సాధించేశారని అంతా అనుకుంటున్నారు.