తెలుగు రాష్ట్రం రాజకీయాల్లో కొణిజేటి రోశయ్యకు పెద్దమనిషిగా పేరుంది. అజాత శత్రువుగా కూడా పేరుంది. ఆయన జన్మతః కాంగ్రెస్ వాది ఆయినప్పటికీ ఆయనకు ఇతర పార్టీలో శత్రువులు లేరు. ఆయన ఇతరులను తిట్టినా సరే.. పెద్దరికంతో మందలించినట్లు ఫీలవుతారే తప్ప.. కోపగించేవారు లేరు. వైఎస్ రాజశేఖరరరెడ్డి ఎంతో గౌరవంతో ఆయన సలహాలను స్వీకరించేవారు. రోశయ్య ఆరకంగా వివాద రహితుడిగానే ఉన్నారు. అలాంటి రోశయ్య కాంగ్రెస్ వ్యక్తిగా గవర్నరు అయినప్పటికీ.. భాజపా సర్కారులోనూ రెండేళ్లుగా ఎలాంటి వివాదం లేకుండా నెట్టుకొస్తున్నారంటే ఎంతటి అజాతశత్రువో లెక్క వేయవచ్చు.
అంతటి రోశయ్య ఆగ్రహంతో రెచ్చిపోయి ఓ నాయకుడి మీద పరువు నష్టం దావా వేసేంత వరకు వెళ్లడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. వ్యవహారం తమిళ రాజకీయ యవనికకు సంబంధించినదే అయినప్పటికీ రోశయ్య తెలుగువారు గనుక.. ఇక్కడ కూడా ఆసక్తికరంగానే ఉంది. ఇంతకూ రోశయ్య కేసు పెట్టింది మరెవ్వరి మీదో కాదు.. తన సొంత పార్టీ అనగా కాంగ్రెసు కే చెందిన తమిళనాడు పీసీసీ చీఫ్ మీద!
ఇంతకూ విషయం ఏంటంటే.. తమిళనాడులో వైస్ ఛాన్సలర్ల నియామకం ఇటీవల వివాదంగా మారింది. ఈ వివాదంలో సీఎం జయలలిత ఇచ్చిన ముడుపులను గవర్నరు రోశయ్య స్వీకరించి.. వీసీ లను నియమించారని అంటూ టీపీసీసీ చీఫ్ ఇళంగోవన్ ఆరోపణలు గుప్పించారు. ఆయన ఆరోపణలు చేసింది.. తమ పార్టీ కి చెందిన రోశయ్య మీదనే. ఇది మన తెలుగు వృద్ధనేతకు ఆగ్రహం తెప్పించింది. ఈ ఆరోపణలు అవాస్తవం అని, గవర్నరుకు అపకీర్తి తెచ్చేలా బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీద పరువు నష్టం దావా వేశారు. మొత్తానికి సోనియా జోక్యం చేసుకుని సర్దుబాటు చేస్తారో, ఇళంగోవన్ నాలిక్కరచుకుని క్షమాపణ చెప్పి తప్పించుకుంటారో తెలియదు గానీ.. రోశయ్య ఆగ్రహం మరోలా చల్లారదని పలువురు అనుకుంటున్నారు.