తమిళనాట కాంగ్రెస్ పార్టీకి డీఎంకే అధినేత కరుణానిధి చుక్కలు చూపించే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఒకవేళ పురట్చితలైవి జయలలిత కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం నమోదు అయినప్పటికీ.. డీఎంకే కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఓట్లు పడినప్పటికీ.. వీలైనంత వరకు కాంగ్రెస్ లేని డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే కరుణానిధి ఇష్టపడుతున్నారు. కేంద్రంలో తమను గతంలో అవమానించిన కాంగ్రెస్ పార్టీకి తమిళనాట అధికారంలో వాటా ఇవ్వడానికి ఆయన సుముఖంగా లేరని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.
ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరుణానిధి ఈ విషయాలను చాలా విపులంగా వెల్లడించారు. 93ఏళ్ల వయసులో, వీల్చెయిర్లోంచి లేవలేని పరిస్థితిలో కరుణానిధి ప్రస్తుతం ఆరోసారి ముఖ్యమంత్రి కావడానికి పోరాడుతున్నారు. ఈసారి డీఎంకే అధికారంలోకి రాకుండా ఏ శక్తులూ అడ్డుకోజాలవని ఆయన అభిప్రాయపడుతున్నారు. తన కొడుకు సీఎం ప్రస్తుతం కాబోడని, తానే సీఎం అవుతానని ఆయన కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.
తాజా ఇంటర్వ్యూలో అయితే తమిళఓటర్లు సంకీర్ణ ప్రభుత్వాలు రాజ్యమేలడాన్ని ఇష్టపడరని కరుణానిధి చెబుతున్న మాటలు కాంగ్రెస్కు ఝలక్ ఇచ్చేలాగా ఉన్నాయి. తమిళనాడులో ఏకంగా 70 స్థానాలు తమకు కావాలంటూ డీఎంకేతో పొత్తు చర్చలు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చిన 42 స్థానాలకే పరిమితమై ప్రస్తుతం పోటీచేస్తున్నది. ఒకవేళ ఈ కూటమికి అధికారం దక్కినా కూడా సంకీర్ణ ప్రభుత్వం రూపంలో కాంగ్రెస్కు కేబినెట్లో వాటా ఇవ్వడానికి మాత్రం కరుణానిధి ఇష్టంగా లేరని తెలుస్తున్నది. బహుశా ఆయనకు తన సొంత పార్టీకే పూర్తి మెజారిటీ వస్తుందనే ధీమా అయినా ఉండొచ్చు. లేదా, కాంగ్రెస్ బలం కూడా అవసరం అయినప్పటికీ.. వారిని బయటినుంచి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో కేందంలోని యూపీఏ సర్కారునుంచి డీఎంకే బయటకు వచ్చిన తర్వాత.. బయటినుంచి మద్దతు ఇచ్చింది. దానికి ప్రతీకారం అన్నట్లుగా.. ఇప్పుడు కాంగ్రెస్ను బయటినుంచి మద్దతు ఇవ్వమని కరుణ కోరగలరని పలువురు భావిస్తున్నారు. పాపం.. ఒకవేళ తమిళనాట ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వచ్చినా.. కాంగ్రెస్కు దక్కేదేమీ లేనట్లున్నది.