కేరళలోని త్రిపుణితురలో నిన్న ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్, వామపక్షాలపై చాలా ఆసక్తికరమయిన వ్యాక్యాలు చేసారు.
ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీ, వామ పక్షాలు రెండు వేర్వేరు పార్టీలు అన్నట్లుగా కేరళ ప్రజలని భ్రమింపజేస్తూ, ఐదేళ్ళు ఒక కూటమి, ఐదేళ్ళు ఇంకొక కూటమి అధికారం పంచుకొంటూ విద్యావంతులైన ఇక్కడి ప్రజలని మోసం చేస్తున్నాయి. నిజానికి ఆ రెండూ ఒకటే. వాటి మధ్య రహస్య అవగాహన ఉంది. అందుకే అవి అవసరమయినప్పుడు ఒకదానికి మరొకటి సహకరించుకొంటాయి. ఇక్కడ బద్ధ శత్రువులలాగ నటిస్తున్న ఆ రెండు పార్టీలు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలిసిపోటీ చేయడం గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. ఆ రెండూ రాష్ట్రంలో తమ అధికారం కాపాడుకోవడం కోసం వేరే పార్టీని అడుగుపెట్టకుండా అడ్డుకొంటూ తమ ఇష్టా రాజ్యంగా పరిపాలిస్తున్నాయి,” అని మోడీ విమర్శించారు.
బెంగాల్ రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం వాస్తవమే కానీ అక్కడ మమతా బెనర్జీని ఓడించడం తమలో ఏ ఒక్క పార్టీ వల్లనో కాదనే భయంతోనే అవి చేతులు కలిపాయని అందరికీ తెలుసు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అధికారం కోసం భాజపా తనను తీవ్రంగా వ్యతిరేకించే పిడిపితో చేతులు కలిపింది. పిడిపి, భాజపాలు వేర్వేరు మతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అలాగే భాజపా జాతీయవాదం భుజానికెత్తుకొంటే, పిడిపి వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోంది. ఇంత విభిన్నమయిన ఆ రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపగా లేని తప్పు, కేరళలో కాంగ్రెస్, వామపక్షాల కూటములు వేర్వేరుగా ఎన్నికలలో పోటీ చేసి, ప్రజామోదంతోనే అధికారం పొందుతున్నప్పుడు వాటిని మోడీ తప్పు పట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన చెపుతున్నట్లు ఒకవేళ ఆ రెండూ ఒకటే అయినా, వాటి మధ్య రహస్య అవగాహన ఉన్నా అదేమీ నేరం కాదు. చట్ట వ్యతిరేకం కాదు. నిజానికి లేని విషయాన్ని ఉన్నట్లుగా చెపుతూ మోడీయే కేరళ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని అర్ధమవుతూనే ఉంది. విద్యావంతులయిన కేరళ ప్రజలు తెలుసుకోలేని ఆ విషయాన్నీ తను కనిపెట్టి హెచ్చరిస్తున్నట్లు చెప్పడం ఇంకా హాస్యాస్పదంగానే ఉంది. ఒక్క కేరళలోనే కాదు దక్షిణాదిన ఏ రాష్ట్రంలో కూడా భాజపా ప్రస్తుతం అధికారంలో లేదు. ఉత్తరాదిన భాజపాకి తిరుగు లేకపోవచ్చేమో గానీ దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల పొత్తులు లేకుండా తనంతట తానుగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అది ఈ ఎన్నికలతో మరోసారి రుజువవబోతోంది.