భాజపా అధిష్టానం గత నెల తెలంగాణాతో సహా ఐదు రాష్ట్రాలకు భాజపా అధ్యక్షులను నియమించింది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న కంబంపాటి హరిబాబు పదవీకాలం రెండు నెలల క్రితమే పూర్తయిపోయినా ఇంతవరకు ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడుని నియమించడానికి వెనకాడుతోంది. కారణాలు అందరికీ తెలిసినవే. అధ్యక్షుడిగా నియమితమయ్యే వ్యక్తిని బట్టే రాష్ట్రంలో తెదేపా, భాజపా సంబంధాలుంటాయి. ఒకవేళ తెదేపాతో తెగతెంపులు చేసుకోవాలనుకొంటే, ఆ తరువాత రాష్ట్రంలో తెదేపాని తట్టుకొని, అది చేయబోయే విమర్శలకు, ఆరోపణలకు ధీటుగా జవాబులు చెపుతూనే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయగల సమర్ధుడయిన వ్యక్తిని అధ్యక్షుడుగా నియమించుకోవలసి ఉంటుంది. ఒకవేళ తెదేపాతో స్నేహం కొనసాగిస్తూ, వచ్చే ఎన్నికలలో దానితో కలిసి పోటీ చేద్దామనుకొన్నట్లయితే తెదేపాకు ఆమోదయోగ్యుడయిన వ్యక్తిని అధ్యక్షుడుగా నియమించుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం ఆ రెండు పార్టీల మధ్య పొత్తుల విషయంలో కొంత సందిగ్ధత నెలకొని ఉంది కనుక ఈ పరిస్థితులలో ఎవరిని అధ్యక్షుడుగా నియమించినా అది తొందరపాటే అవుతుంది. కనుక పొత్తులపై స్పష్టత వచ్చే వరకు కంబంపాటి హరిబాబునే కొనసాగిస్తున్నట్లు భావించవచ్చు. ఆయన తెదేపాతో న్యూట్రల్ గా వ్యవహరిస్తున్నారు కనుక ఆయన వలన రెండు పార్టీలకు ఎటువంటి ఇబ్బందీ, అభ్యంతరాలు లేవు కనుక మరికొంత కాలం ఆయననే అధ్యక్షుడుగా కొనసాగించవచ్చు.