తెలంగాణాలోని పాలమూరు, దిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 16,17,18 తేదీలలో కర్నూలులో నిరాహార దీక్ష చేయబోతున్నారు. విచిత్రం ఏమిటంటే తెలంగాణా ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల కాంట్రాక్టులను వైకాపా కడప జిల్లా రాజంపేట ఎంపి మిథున్ రెడ్డికే ఇచ్చిందని, వాటిని జగన్మోహన్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి ఆయనకి ఇప్పించారని తెలంగాణా తెదేపా కార్యదర్శి గురజాల మాల్యాద్రి ఆరోపిస్తున్నారు. ఆ రెండు ప్రాజెక్టులలో కలిపి మొత్తం రూ. 7000 కోట్లు విలువగల పనులను మిదున్ రెడ్డి సంస్థకి కట్టబెట్టినట్లు ఆయన ఆరోపించారు. తెలంగాణా ప్రాజెక్టుల పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎందుకు అప్పగిస్తున్నారని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చాలా రోజులుగా ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయన ప్రశ్నలకు ఇంతవరకు తెరాస నేతలెవరూ జవాబు ఇవ్వలేదు..కనీసం ఖండించలేదు. అంటే మిథున్ రెడ్డికి ఆ రెండు ప్రాజెక్టుల పనులు అప్పగించడం నిజమేనని నమ్మవలసి ఉంటుంది. మిథున్ రెడ్డికి కాంట్రాక్టు దక్కడం నిజమయితే దాని కోసం జగన్ సిఫార్సుకూడా నిజమేనని అనుమానించవలసి ఉంటుంది. తెదేపా నేతలు చేస్తున్న ఈ ఆరోపణలపై తెరాస, వైకాపాలు రెండూ స్పందించకపోవడమే ఈ అనుమానాలకు తావిస్తోంది.
ఆ ప్రాజెక్టులు మిథున్ రెడ్డికి చెందిన సంస్థకి ఇచ్చామని తెలంగాణా ప్రభుత్వం ఇంత వరకు చెప్పలేదు. కానీ ఇచ్చిందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు కనుక దానిని నిరూపించేందుకు తగిన ఆధారాలు ప్రజలకు చూపిస్తే అవి నిజమని నమ్మకం కలుగుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి వీలవుతుంది. ఒకవేళ తెదేపా నేతలు చేస్తున్న ఈ ఆరోపణలు నిజమయితే, ఆంధ్రాకు తీవ్ర నష్టం కలిగించే ఆ ప్రాజెక్టులను ఆంధ్రాకే చెందిన వైకాపా ఎంపి మిథున్ రెడ్డే నిర్మిస్తుంటే, వాటిని వ్యతిరేకిస్తూ జగన్ నిరాహార దీక్షలు చేయడానికి సిద్దపడటాన్ని ఏమనుకోవాలి?