ఉప ఎన్నిక జరుగుతున్న పాలేరు నియోజకవర్గంలో గులాబీ జెండాల రెపరెపలు తెరాస ప్రచార హోరును చాటుతున్నాయి. అధికార పార్టీగా తెరాసకు వద్దంటే కేడర్ వచ్చి పడుతోంది. నియోకవర్గం అంతటా వారి కార్యకర్తల దండు కనిపిస్తోంది. దాదాపు పది మంది మంత్రులు మంత్రాంగం నెరపుతున్నారు. ఇతర పార్టీల వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీలోకి వస్తే మంచి జరుగుతుందంటూ కాంగ్రెస్ నేతలను వీలైనంత మందిని కారెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు.
కాంగ్రెస్ నేతల విమర్శల ప్రకారం, 10 మంది మంత్రులు, దాదాపు 50 మంది ఎమ్మల్యేలు పాలేరులో తిష్ట వేశారట. ఈ లెక్క ఎంత పక్కానో ఏమో గానీ పెద్ద పెద్ద కార్లు, బడా వీఐపీ నేతల టూర్లు మాత్రం జోరుగా జరుగుతున్నాయి. గ్రామ స్థాయి, సర్పంచి స్థాయి కాంగ్రెస్ నేతలు వీలైనంత మందిని గులాబీ శిబిరానికి రప్పించే పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇలా వీలైనంతగా కేడర్ ను, నాయకులను ఆకర్షిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు పడిపోతుందనేది గులాబీ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.
ఎన్నికల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. కాంగ్రెస్ లో మాత్రం ఈ జోరు కనిపించడం లేదు. ప్రచార ఆర్భాటమే ప్రాతిపదికగా తీసుకుంటే గులాబీ పార్టీ ముందు హస్తం పార్టీ ఏమాత్రం సరితూగడం లేదు. అన్ని విధాలుగా తెరాసదే పైచేయిగా కనిపిస్తోంది. ఎన్నికల హంగూ ఆర్భాటం మామూలుగా లేదు. అయితే, ఎంత ఆర్భాటం చేసినా, ప్రచారానికి ఇతరత్రా ఎంత భారీగా ఖర్చు పెట్టినా ప్రజలు తమకే ఓటు వేస్తారంటున్నారు కాంగ్రెస్ నేతలు.
పాలేరు అంటే చేతిగుర్తుకు కంచుకోట అనేది కాంగ్రెస్ వారి నమ్మకం. తాము ఇంటింటి ప్రచారంమే తప్ప, తెరాస చేస్తున్నట్టుగా వందలాది కార్లలో హంగామా చేయలేమని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మంత్రులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని, గ్రామాల్లో తమ పార్టీ వారిని నయానోభయానో లొంగదీసుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తెరాస నేతలు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ గెలవలేక ఆరోపణలు చేస్తోందనేతి తెరాస ప్రత్యారోపణ.
పాలేరులో అతి భారీ మెజారిటీతో తమ మంత్రిని గెలిపించుకోవలనే పంతంతో తెరాస అతి హంగామా చేస్తోంది. మొత్తానికి హంగూ ఆర్భాటానికి, పోటీలో ఉన్న ప్రధాన పార్టీల ప్రచారానికి ఖర్చు భారీగా అవుతున్నట్టు కనిపిస్తోంది. అధికార పార్టీ అనే హవాతోపాటు సీపీఎం బరిలో ఉండటం కూడా తమకు కలిసి వస్తుందని తెరాస నేతలు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ ఒకప్పుడు ఉన్నంత బలంగా లేదని, హస్తం పట్టు సడలిందని తెరాస చేస్తున్న వాదన నిజమా కాదా అనేది కౌంటింగ్ నాడు తేలిపోతుంది.