మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయని సింహస్థ పుష్కరాలలో బిజెపి అద్యక్షుడు అమిత్ షా రాజకీయ0 చేయడం వివాదాస్పదమైంది. సమరసతా స్నాన్, సమరసతా భోజ్ అంటూ ఆయన దళితులను తీసుకొచ్చి బిజెపి రాజకీయ వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమైనారు. . అమిత్ షా స్నానాలు చేయడమే గాక దళిత స్వాములు సాధుసంతుల కేంద్రమైన వాల్మీకీ ధామ్ కూడా సందర్శించి రాజకీయసందేశమిచ్చారు. ఇవన్నీ చాలనట్టు సిద్ధాంత మహాకుంభ పేరిట బిజెపి రాజకీయ మేళా కూడా నిర్వహించారు. 2004లో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ఇక్కడ కుంభమేళా జరిగినప్పుడు ఇలాటి తతంగాలేమీ లేవు. కాని ఈసారి అమిత్ షా చాలా హంగామా చేయడంతో పోలీసులు అధికారులు పూర్తిగా ఆ పనిలోనే మునిగిపోయారు.దీంతో భద్రత ఎక్కడ దెబ్బతింటుందోనని యాత్రీకులు స్థానికులు భయపడుతున్నారు. 1954లో ఇక్కడ పుష్కరాలలో వందలాది మంది తొక్కిసలాటలో మరణించారు. ప్రస్తుత కుంభమేళాకు అయిదుకోట్ల మంది వస్తారని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం ప్రచారం చేసింది. అయితే ఇటీవల గాలివాన తుపాను కారణంగా అంతా అస్తవ్యస్తమైంది. ఏడుగురు మరణించగా అనేక మంది గాయపడ్డారు.