తెలంగాణాలో భాజపా పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. రాష్ట్రంలో తెరాసకు తామే ప్రత్యామ్నాయం అని గొప్పలు చెప్పుకొనే భాజపా దానికి ఎంతో బలం ఉందనుకొన్న గ్రేటర్ హైదరాబాద్ లో కూడా గెలవలేక చతికిలపడింది. వరంగల్ ఉపఎన్నికలలో పోటీ చేయడానికి పార్టీలో అభ్యర్దే లేకపోవడంతో ఎన్.ఆర్.ఇ.ని తెచ్చుకోవలసిన దుస్థితి. పాలేరు ఉపఎన్నికలలో పోటీ చేయడానికి భయపడి మానుకొంది. దీని కంతటికీ కారణం తెదేపాతో పొత్తులేనని చెప్పేసి మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేతులు దులుపుకొని ఎంచక్కా వెళ్లిపోయారు. కానీ పార్టీ దుస్థితికి అదొక్కటే కారణం కాదని అందరికీ తెలుసు. అందుకే భాజపా అధిష్టానం కిషన్ రెడ్డిని తప్పించి పార్టీ బాధ్యతలను డా.లక్ష్మణ్ కి అప్పగించింది.
ఆయన బాధ్యతలు చేపట్టగానే జిల్లాల పర్యటన మొదలుపెట్టి పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో అంతర్గత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అదే సమయంలో స్థానిక ప్రజలతో కూడా మాట్లాడి ప్రజా సమస్యల గురించి తెలుసుకొంటున్నారు. తన పర్యటనల ద్వారా పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయడానికి, జిల్లాలలోని పార్టీ నేతలకు, కార్యకర్తలకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
ఏడాదిన్నర క్రితం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణాలో పర్యటించినప్పుడు, రాష్ట్ర నేతలు హైదరాబాద్ లో కూర్చోకుండా రాష్ట్రంలో జిల్లాలు, గ్రామాలు పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసుకొమ్మని సూచించారు. కానీ ఆయన మాటలను కిషన్ రెడ్డి పట్టించుకోలేదు. తత్ఫలితంగా ఏడాదిన్నరలోనే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టిన డా. లక్ష్మణ్ ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టారు కనుక వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మళ్ళీ మెరుగుపడవచ్చు. అయితే తెరాస ధాటిని తట్టుకొని ఎదురునిలవాలంటే దానితో పొత్తులయినా పెట్టుకోవాలి లేదా రాష్ట్రంలో పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మించుకోవలసి ఉంటుంది. ఇక్కడ డా.లక్ష్మణ్ తన పని తాను చేసుకొని పోతుంటే, అక్కడ డిల్లీలో పెద్దలు రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి సిద్దం అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల చాలా సానుకూలంగా వ్యవహరిస్తుండటం గమనిస్తే, డిల్లీ పెద్దలు తెలంగాణాలో తమ పార్టీ కోసం ఏదో వ్యూహం సిద్దం చేస్తున్నట్లే ఉంది. ఆంధ్రాలో భాజపా పరిస్థితి కూడా తెలంగాణాకు ఏమాత్రం భిన్నంగా లేదు. కనుక ఆంధ్రాలో ఆ పార్టీ నేతలు కూడా డా.లక్ష్మణ్ ని ఆదర్శంగా తీసుకొని పని మొదలుపెడితే మంచిదేమో?