తెదేపా-భాజపాల సంబంధాలు పునర్నిర్వచించుకోవలసిన అవసరం ఏర్పడటంతో డిల్లీ నుంచి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ ఇవ్వాళ్ళ విజయవాడ వచ్చారు. ఇవ్వాళ్ళ పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో రాష్ట్ర మంత్రులు డా. కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు, రాష్ట్ర నేతలు పురందేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణ, కావూరి సాంభశివరావు, ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. “తెదేపా ప్రభుత్వం ప్రజా సమస్యలను, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను పట్టించుకోకుండా, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపులపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు, గిట్టుబాటు ధరలు లేక రైతులు నానా కష్టాలు పడుతున్నా తెదేపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అది ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి తాపత్రయం పడటం కంటే ప్రజాహితమయిన పనులు చేసి ప్రజల మెప్పుపొందితే దానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నా అభిప్రాయం. ఇంతకాలం తెదేపా మా మిత్రపక్షమని మౌనం వహించ వలసి వచ్చింది. కానీ తెదేపా నేతలు మిత్రధర్మం పాటించకుండా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చోలేము కదా అందుకే తెదేపా ప్రభుత్వ లోపాలని, అది చేస్తున్న తప్పులను ఎత్తి చూపవలసి వస్తోంది. ఇకనయినా తెదేపా తన వైఖరి మార్చుకొనే బాగుంటుంది,” అని సోము వీర్రాజు సమావేశంలో అన్నట్లుగా తెలుస్తోంది.
తెదేపా పట్ల కాస్త సున్నితంగా వ్యవహరించే భాజపా ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా తెదేపా ఫిరాయిమ్పులని తప్పు పట్టారు. ఇటువంటి అనైతిక, అప్రజాస్వామిక చర్యలకి భాజపా ఎప్పుడూ వ్యతిరేకమే కానీ తెదేపా మిత్రపక్షం కావడంతో ఇన్నాళ్ళూ ఈ విషయం గురించి బయటకు మాట్లాడలేకపోయామని అన్నారు. కేంద్రం అన్ని విధాలా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తున్నా కూడా, రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదు ఏమీ చెయ్యడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అనడం తనకు చాలా బాధ కలిగించిందని విష్ణు కుమార్ రాజు చెప్పారు.
ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం తెదేపా పట్ల ఇకపై తమ వైఖరి ఏవిధంగా ఉండాలనే దానిపై చర్చించడం. ఆ విషయం వారు చర్చించి తగిన నిర్ణయం తీసుకొంటారో లేదో తెలియదు కానీ యదా ప్రకారం సోము వీర్రాజు, తదితర నేతలు అందరూ తెదేపాపై విమర్శలు గుప్పిస్తున్నట్లు కనిపిస్తోంది. సమావేశం ఉద్దేశ్యం అదే అయితే, ఆ మాత్రం దానికి డిల్లీ నుంచి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ పనిగట్టుకొని విజయవాడ రావడం అనవసరమే. భాజపా నేతలు ఆపని రోజూ చేస్తూనే ఉన్నారు.