రజనీకాంత్ సినిమా వస్తోందంటే బాక్సాఫీసుకి పండగే! అది డబ్బింగ్ బొమ్మే అయినా తెలుగు నుంచి పంపిణీదారులు కూడా ఆ సినిమా హక్కుల్ని చేజిక్కించుకోవడానికి ఎగబడతారు. రోబో సినిమా రికార్డు ధరకు అమ్ముడుపోయింది. లాభాల్నీ అలానే ఆర్జించింది. ఇప్పుడు కబాలీకీ అలాంటి గిరాకీనే ఏర్పడింది. పెద్ద సినిమాల్ని తన చాతుర్యంతో పట్టేస్తుంటాడు దిల్‌రాజు. కబాలీ సినిమా కోసం కూడా భారీగా ప్రయత్నాలు సాగించాడు. అయితే.. చివరి నిమిషంలో దిల్‌రాజు డ్రాప్ అవ్వడంతో అభిషేక్ పిక్చర్స్ ఎగరేసుకుపోయింది. కబాలీ తెలుగు రైట్స్‌కి అభిషేక్ సంస్థ ఏకంగా రూ.31 కోట్లకు జేజిక్కించుకొంది. దిల్‌రాజు రూ.25 కోట్ల వరకూ వెళ్లి ఆగిపోయారు.
గతంలో రజనీకాంత్ సినిమా లింగ తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. ఆశలకు పోయి, భారీ రేట్లు పోసి సూపర్ స్టార్ సినిమా కొంటే ఏమవుతుందో లింగ నిరూపించింది. ఆ భయాలు కబాలీనీ తాకాయి. అందుకే దిల్‌రాజు వెనకడుగు వేశాడట. సినీ వర్గాలు మాత్రం ఈసినిమా దిల్‌రాజుకి దక్కకపోవడం వెనుక మరో కారణం ఉందంటున్నాయి. ‘పోలీస్’ సినిమా హక్కుల్ని తీసుకొని సరిగా ప్రచారం చేయకపోవడంతో ఆ సినిమా తెలుగు నాట డిజాస్టర్ అయ్యింది. ఆ చిత్రానికీ, కబాలి చిత్రానికి అసలు నిర్మాతలు ఒక్కరే. అందుకే.. దిల్‌రాజుకి కబాలీ సినిమా దక్కకుండా చేశారని టాక్ వినిపిస్తోంది. ఏదైతేనేం.. కబాలీ సినిమాని వదులుకోవాల్సివచ్చింది దిల్‌రాజు. అది మంచికా, చెడుకా అన్నది కబాలీ రిజల్ట్ వచ్చాకే తేలుతుంది.