ఏపిలో తెదేపా, భాజపా నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకి క్రమంగా తీవ్రం అవుతోంది. ‘ప్రజా సమస్యలని గాలికొదిలి ఎమ్మెల్యేల ఫిరాయింపులపైనే తెదేపా దృష్టి పెడుతోందని’ భాజపా నేత సోము వీర్రాజు విమర్శిస్తే, ‘ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తే భాజపాకి కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని’ తెదేపా ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శాపం పెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ విశ్వసనీయత కూడా ప్రశ్నార్ధకం అవుతుందంటూ, సున్నితంగా ఆయనని కూడా విమర్శించడం గమనార్హం. కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్ళినప్పుడు కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి, తమ మిత్రపక్షమయిన తెదేపా ప్రభుత్వంపై ఆయన చేసిన పిర్యాదులు, ఆరోపణలన్నిటినీ చాలా శ్రద్దగా విన్నందుకు తెదేపా మంత్రులు, నేతలు వారిని విమర్శించారు. ఈసారి సోమిరెడ్డి ప్రధానినే విమర్శించడం గమనార్హం.
‘కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా బారీగా నిధులు మంజూరు చేస్తోందని, కానీ వాటిని తెదేపా ప్రభుత్వం వేరే అవసరాలకు మళ్ళిస్తోందని, కనీసం లెక్కలు కూడా చెప్పడం లేదని’ రాష్ట్ర భాజపా నేతలు ఆరోపిస్తుంటే, ‘అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అరకొరగా నిధులు విదిలించిందే తప్ప, ఏనాడూ దేనికీ తగినన్ని మంజూరు చేయలేదని’ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఇచ్చి ఉంటే దేనికి ఎంత ఇచ్చిందో మీరే చెప్పాలని ఆయన భాజపా నేతలను ఎదురు ప్రశ్నించారు.
భాజపాతో పొత్తులు పెట్టుకొంటే రాష్ట్రాభివృద్ధికి తగినన్ని నిధులు ఇస్తుందని తెదేపా, దానితో పొత్తులు పెట్టుకొంటే తప్ప రాష్ట్రంలో గెలవడం కష్టం అనే భయంతో భాజపా పొత్తులు పెట్టుకొన్నాయి. ఆ రెంటి మధ్య మంచి బలమయిన స్నేహ సంబంధాలు, ఇచ్చి పుచ్చుకొనే ధోరణి ఉన్నందున వాటిని గెలిపిస్తే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో ప్రజలు వారి కూటమికి ఓట్లు వేసి అధికారం కట్టబెట్టారు. కానీ ఆ రెండు పార్టీలు ప్రజల ఆశలను, నమ్మకాన్ని వమ్ము చేసి, ఒకదానినొకటి నిందించుకొంటూ తమ బాధ్యతల నుంచి తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. అది అర్ధం చేసుకొనే శక్తి ప్రజలకు లేదని భావించడంవలననే అవి ఆవిధంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పవచ్చు. కానీ తమను మోసం చేసిన పార్టీకి ప్రజలు ఏవిధంగా బుద్ధి చెప్పారో వారే చెప్పుకోవడం విశేషం. తెదేపా, భాజపాలు రెండూ కూడా తమకు అటువంటి పరిస్థితి రాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ముందే జాగ్రత్తపడితే మంచిది.