ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్… ఈ పేర్లు చెబితే చాలు ఓ క్లాసీ అనుభూతి కలుగుతుంది. తెలుగు సినిమాని సహజత్వానికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల. అనామిక తరవాత ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు. మధ్యలో హ్యాపీడేస్‌ని బాలీవుడ్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టి తెలుగు సినిమాపై ఫోకస్ పెట్టాడట. ప్రస్తుతం ఓ స్ర్కిప్టు రాసి దిల్‌రాజుని వినిపించడం, ఆయన ఎగ్జైట్ అయి.. వెంటనే ఓకే చేసేయడం జరిగిపోయాయని టాక్. ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తాడట.
ప్రస్తుతం మిస్టర్ సినిమాతో బిజీగా ఉన్నాడు వరుణ్. ఈసినిమా వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్తుంది. ఆ తరవాత శేఖర్ కమ్ముల సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ యూత్ ఫుల్ స్టోరీలనే టచ్ చేసిన శేఖర్ కమ్ముల తొలిసారి ఓ ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్ర్కిప్టు రాసినట్టు తెలుస్తోంది. ఈ యేడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.