ఉల్లిపాయలు కోయకుండానే కన్నీరు వస్తోంది. అందుకే, రైతుబజార్లలో కిలో ఉల్లి 20 రూపాయలకే అమ్మాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకీ ఉల్లి ధరలు తరచూ ఎందుకు పెరుగుతాయి? అసలు ఉల్లి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం
ఉల్లిపాయలకూ రాజకీయాలకూ అవినాభావ సంబంధం ఉంది. 1998 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి అధికార బీజేపీని ఓడించింది కాంగ్రెస్ పార్టీ అనేకంటే ఉల్లిపాయలు అనడమే కరెక్టని వ్యాఖ్యలు వినిపించాయి. అప్పట్లో ఢిల్లీలో ఉల్లిపాయలకు తీవ్రమైన కొరత వచ్చింది. కిలో ఉల్లి 60 రూపాయలకు కొనాల్సి వచ్చింది. అంతే, ఆనాటి ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ పనితీరు బాగుందనే టాక్ ఉన్నప్పటికీ బీజేపీ ఓడిపోయింది. ఆ దెబ్బతో ఇప్పటి వరకూ మళ్లీ కమలం వికసించలేదు. అదీ ఆనియన్ ఎఫెక్ట్!
మన దేశంలో ఏటా సుమారు 190 లక్షల టన్నుల ఉల్లి సాగవుతుంది. ఇందులో 60 శాతం వరకు ఏప్రిల్, మేనెలల్లో రబీ సీజన్లో సాగవుతుంది. దేశంలోని ఉల్లి దిగుబడిలో 30 40 శాతం వాటా మహారాష్ట్రదే. నాసిక్, అహ్మద్ నగర్, పుణే ప్రాంతాన్ని ఆనియన్ బెల్ట్ అని పిలుస్తారు.
మహారాష్ట్రలో పలువురు పెద్ద రైతులు, హోల్ సేల్ వ్యాపారులు నాలుగైదు నెలల పాటు ఉల్లిపాయలను కోల్ట్ స్టోరేజిల్లో నిల్వ ఉంచి, సరఫరా తగ్గి డిమాండ్ పెరిగినప్పుడు సరుకును బయటకు తీసి అమ్ముతారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఉల్లిఘాటు మహిమ ఏమిటో బీజేపీకి బాగా తెలుసు. అందుకే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉల్లిని కూడా నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చారు. అలాగే ఉల్లి ఎగుమతులను తగ్గించడానికి సుంకాన్ని కూడా ప్రభుత్వం భారీగా పెంచింది.
ఉల్లిపాయలపై మ్యాగ్జిమం ఎక్స్ పోర్ట్ ప్రైస్ ను 300 డాలర్లకు పెంచుతూ కేంద్రం గత ఏడాది జూన్ 17న నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లోనే ఆ మొత్తాన్ని 500 డాలర్లకు పెంచింది. ఆ తర్వాత ఆ మొత్తాన్ని 300 డాలర్లకు తగ్గించింది. ప్రస్తుతం టన్నుకు 250 డాలర్ల ఎగుమతి సుంకం అమల్లో ఉంది.
ప్రపంచంలో ఉల్లి సాగులో నెంబర్ దేశం ఏదీ అంటే డ్రాగన్ చైనా పేరే చెప్పాలి. అది మనకు అందనంత దూరంలో ఉంది. మనం రెండో స్థానంలో ఉన్నాం. టాప్ 5 దేశాలు, ఉల్లి ఉత్పత్తి వివరాలు ఇలా ఉన్నాయి.
1. చైనా- 2,08,17,295 టన్నులు
2 భారత్- 81,78,300 టన్నులు
3. అమెరికా- 33,49,170 టన్నులు
4. పాకిస్తాన్- 20,15,200 టన్నులు
5. టర్కీ- 20,07,120 టన్నులు
అవసరాలకు అనుగుణంగా చైనా ఉల్లి ఉత్పత్తిని పెంచుకుంటోంది. మన దేశంలోనూ మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, కర్ణాటక మాత్రమే కాకుండా మిగతా రాష్ట్రాల్లోనూ ఉల్లి సాగును ప్రోత్సహించాలని ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. లేకపోతే ముందు ముందు జరగబోయే బీహార్, బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఇబ్బంది కలుగుతుందేమో అని కమలనాథులు సందేహిస్తున్నారట.