కాంగ్రెస్ అంటే కుంభకోణాలకి మారుపేరు అనే అప్రదిష్టని సార్ధకం చేసుకొంటూ, దాని హయాంలో జరిగిన మరో బారీ కుంభకోణం ఈరోజు వెలుగు చూసింది. అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణంపై రేగిన దుమారం ఇంకా చల్లారక ముందే నేవీ ట్యాంకర్ల కుంభకోణం బయటపడింది.
భారత్ నావికాదళానికి చెందిన యుద్ధనౌకలు సముద్రంలోకి వెళ్ళినప్పుడు వాటికి అవసరమయిన డీజిల్, మంచి నీళ్ళు, ఇతర సామగ్రిని చాలా భారీ స్థాయిలో తీసుకువెళ్ళి అందించడానికి రెండు నేవీ ట్యాంకర్ షిప్పులని యూపియే ప్రభుత్వం కొనుగోలు చేయాలనుకొంది. 2006లో వాటి కోసం గ్లోబల్ టెండర్లు పిలువగా, రష్యా, దక్షిణ కొరియా, ఇటలీ దేశాలు పోటీ పడ్డాయి. వాటిలో రష్యా అత్యుత్తమయిన మిలటరీ గ్రేడ్ స్టీల్ ని ఉపయోగించి ట్యాంకర్లు తయారు చేస్తామని ప్రతిపాదించగా, సాధారణ స్టీల్ నుపయోగించి చేస్తామన్న ఫిన్కాంటైరీ అనే ఇటలీ సంస్థకి ఆ కాంట్రాక్టు కట్టబెట్టింది. ఆ టెండర్లలో చాలా లోపాలు ఉన్నట్లు 2010లోనే కాగ్ నివేదిక బయటపెట్టింది. అయినా యూపియే ప్రభుత్వం పట్టించుకోకుండా దానికే ఆ కాంట్రాక్టు అప్పగించింది.
రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన అతిపెద్ద విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్.విక్రమాదిత్యాని 2011లో రష్యా నుంచి భారత్ తీసుకు రావడానికి ఈ రెండు ట్యాంకర్లు చాలా అత్యవసరం అవడంతో, వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇటలీ సంస్థ నిర్మించి భారత్ కి అందజేసింది. చాలా తక్కువ సమయంలోనే భారత ప్రమాణాల ప్రకారం ఆ రెండు ట్యాంకర్లను నిర్మించబడ్డాయని, నాటి రక్షణ మంత్రి ఎకె అంటోనీ చాలా గొప్పగా చెప్పుకొన్నారు. అవి నిజంగానే పటిష్టంగా నిర్మించబడి ఉంటే, అందులో ఎంత పెద్ద కుంభకోణం జరిగినా బహుశః అది ఎన్నటికీ బయటపడేది కాదేమో?
కానీ రష్యా నుంచి ఐ.ఎన్.ఎస్.విక్రమాదిత్యాని భారత్ తీసుకువస్తున్నప్పుడు అవి అట్లాంటిక్ మహాసముద్రంలో పయనిస్తున్నప్పుడు వాటిలో ఐ.ఎన్.ఎస్. దీపక్ అనే పేరుగల సరికొత్త ట్యాంకర్ షిప్పు ఆ సముద్రం ఆటుపోటులకు తట్టుకోలేకపోయింది. సాధారణంగా అటువంటి భారీ షిప్పులు ఎటువంటి వాతావరణ పరిస్థితిలో అయినా నిలకడగా పయనించగల సామర్ధ్యం కలిగి ఉంటాయి. ఆ అలల దాటికి షిప్పుకి రక్షణగా ఉండే స్టీల్ ప్లేట్లలో పగుళ్ళు కూడా ఏర్పడినట్లు గుర్తించగానే, దానిని సమీపంలో గల పోర్చుగల్ లోని లిస్బన్ ఓడరేవుకి అత్యవసరంగా తరలించవలసి వచ్చింది.
రెండేళ్ళ క్రితం వరకు కేంద్రంలో యూపియే ప్రభుత్వమే అధికారంలో ఉంది కనుక ఈ విషయాలేవీ బయటకు పొక్కలేదు. మాజీ నేవీ అధికారి ఒకరు కొన్ని నెలల క్రితం ఈ వ్యవహారాన్ని బయటపెట్టి, దీనిపై లోతుగా విచారణ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడంతో ఈ కుంభకోణం బయటపడింది. చాలా బారీ పరిమాణంలో డీజిల్, మంచినీళ్ళు వంటి పదార్ధాలను తీసుకొని సముద్రంలో చాలా దూరాలు ప్రయాణించవలసిన ఇటువంటి ట్యాంకర్లకి కేవలం మిలటరీ గ్రేడ్ స్టీల్ ని మాత్రమే వినియోగించాలి. ఆవిధంగా తయారుచేసి ఇచ్చేందుకు సిద్దపడిన రష్యా సంస్థని కాదని, సాధారణ స్టీల్ తో తయారుచేస్తానని చెప్పిన ఇటలీ సంస్థకే ఈ కాంట్రాక్టు కట్టబెట్టడంపై నేవీ అధికారులు కూడా అప్పుడే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ యూపియే ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. మాజీ నేవీ అధికారి పిర్యాదు మేరకు రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ నేవీలో అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగిందో తెలుసుకోవాలంటే వారి నివేదిక రావలసి ఉంది.