కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగుస్తుంది. సోమవారం నాడు పోలింగ్ నిర్వహించి, గురువారం నాడు ఓట్ల లెక్కింపు చేసి వెంటనే ఫలితాల వెల్లడిస్తారు. ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన అసోం, బెంగాల్ శాసనసభ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు వెల్లడవుతుంది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
తమిళనాడులో పోటీ ప్రధానంగా అధికార అన్నాడిఎంకె, ప్రతిపక్ష డిఎంకె, డిఎండికె పార్టీల మధ్యనే జరుగుతోంది. ఇప్పటికే గత ఐదేళ్ళుగా డిఎంకె ప్రతిపక్షంలో ఉంది కనుక ఈ ఎన్నికలలో విజయం సాధించడం దానికి అత్యవసరం. 91 ఏళ్ల వయసున్న డిం.ఎం.కె. అధ్యక్షుడు కరుణానిధి బహుశః ఇవే ఆఖరి ఎన్నికలు కావచ్చు. ఈ ఎన్నికలలో డిఎంకె పార్టీ గెలువలేకపోతే, ఆయన కుమారుడు స్టాలిన్ ఇక ఎన్నటికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం పొందలేకపోవచ్చు. కనుక ఈ ఎన్నికలు డిఎంకె జీవన్మరణ సమస్య వంటివేనని భావించవచ్చు. ముఖ్యమంత్రి జయలలితకి కూడా తన అధికారం నిలబెట్టుకోవడం చాలా అవసరమే కనుక ఆమెకు ఈ ఎన్నికలలో గెలవడం అత్యవసరం. డిఎండికె అధినేత, నటుడు కెప్టెన్ విజయ్ కాంత్ కి కూడా ముఖ్యమంత్రి అవ్వాలనే చాలా కోరిక ఉన్నప్పటికీ అది నెరవేరే అవకాశాలు తక్కువే. ఈ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తున్న భాజపా సింగిల్ డిజిట్ స్థానాలు దక్కించుకొన్నా అది చాలా గొప్ప విషయమే అవుతుంది.
కేరళలో ఈసారి వామపక్ష కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. కేరళలో మొత్తం 140 స్థానాలలో భాజపా 98 స్థానాలకి పోటీ చేస్తోంది. కానీ అక్కడ కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం కావచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్-87, సి.పి.ఐ.(ఎం) 85 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మిగిలిన స్థానాలలో వాటి మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి.