తెలుగుదేశంలోకి మారిన ఎమ్మెల్యేల పదవి ఊడపీకించే ప్రయత్నంలో వున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ కి ఉత్తరాఖండ్ పరిణామం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అక్కడ కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలకు విశ్వాస పరీక్షలో ఓటు హక్కు లేకుండా సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చింది. అదే రూలింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికలకు కూడా అదే రూలింగ్ వర్తింపజేయాలని ఆపార్టీ కోర్టుని కోరబోతోంది.
67 మంది వున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఇప్పటికి 17 మంది తెలుగుదేశంలోకి దూకేశారు. ఎపి నుంచి రాజ్యసభలో 4 స్ధానాలు ఇపుడు ఖాళీ అవుతున్నాయి. కనీసం 36 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తేతప్ప ఒక వ్యక్తి రాజ్యసభ సభ్యుడు కాలేరు. ఇపుడున్న బలాల ప్రకారం తెలుగుదేశం నుంచి ముగ్గురు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు పోటీ లేకుండా ఎన్నికౌతారు. ఏ పార్టీ వారు మరో వ్యక్తిని పోటీకి దింపినా ఎదుటి పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప గెలవడం సాధ్యం కాదు.
పార్టీ ఫిరాయించినవారిని అనర్హులుగా ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే శాసనసభ స్పీకర్ కు పిటీషన్ ఇచ్చింది. ఫిరాయింపుల నిరోధకచట్టంలో చర్యకు గడువులేని అవకాశాన్ని (స్పీకర్ ద్వారా) తెలుగుదేశం పార్టీ వాడుకుంటోంది. ”చర్యల గురించి స్పీకర్ ఆలోచిస్తున్నారని” సరిపెట్టుకోవడం తప్ప ఎవరూ చేయగలిగింది లేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మరో 15 మంది మారితే ఆపార్టీకి రాజ్యసభలో చోటు వుండదు. అయితే రాజ్యసభ ఎన్నికలలోగా అంత మంది తెలుగుదేశంలోకి జంప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి.
తమనుంచి వెళ్ళిపోయిన వారి ఓట్లు తెలుగుదేశానికి దక్కకుండా విప్ జారీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. విప్ కి చూపించే ఓటు వేసేలా ఆదేశించాలని ఎన్నికల అధికారిని కోరబోతున్నారు. ఇందువల్ల ఫిరాయింపజేసుకున్న ప్రయోజనం తెలుగుదేశానికి దక్కదు. ఏదో నెపం చూపించి ఎన్నికకు గైర్ హాజరైతే విప్ నుంచి తప్పించుకోవచ్చు. అందువల్ల తెలుగుదేశానికి లాభం వుండదు. ఇదేమీ జరగకపోతే ఉత్తరాఖండ్ లో మాదిరిగా ఫిరాయించిన వారికి ఓటు హక్కు లేకుండా చూడాలని కోర్టుని ఆశ్రయించబోతున్నారు.
తెలుగుదేశం తనలోకి ఫిరాయించిన వారి పదవులు కాపాడుతూ వారి ఓటు హక్కు తనకు ఉపయోగపడేలా వ్యూహాన్ని రూపొందిస్తోంది. 15 మందిని కాకపోయినా మరో 6 మందినైనా వెంటనే తనలో కలిపేసుకుంటే ఫిరాయింపు దారుల సంఖ్య 23 అవుతుంది. 67 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 23 మంది అంటే మూడోవంతు మంది అవుతారు. కనీసం మూడోవంతు మంది పార్టీ మారితే దాన్ని ఫిరాయింపుగాకాక, పార్టీలో చీలికగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అందువల్ల ఫిరాయించిన వారు పదవులనుకోల్పోరు.
ఈనేపధ్యంలో మరో ఆరుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తెలుగుదేశం గురిపెట్టినట్టు అర్ధమౌతోంది.