వ్యక్తుల సంస్థల పరువు ప్రతిష్టలకు భంగంపై కేసు ల్లో శిక్ష, జరిమానా వేసే ఐపిసి 499,500 సెక్షన్ల చెల్లుబాటును సుప్రీం కోర్టు సమర్థించడం మీడియాకు ముప్పుగా మారనుంది. హిందూ, హిందూస్థాన్ టైమ్స్ వంటి పత్రికలు దీనిపై భిన్నాభిప్రాయం వెలిబుచ్చాయి. మామూలుగా మీడియాలో ఏదైనా అసత్య కథనమో లేక అభ్యంతర కర సమాచారమో వస్తే ప్రముఖంగా సవరణ లేక క్షమాపణ చెప్పడం జరుగుతుంది. అలా చేయవలసిందిగా కోర్టు నోటీసు ఇచ్చి ఆ గడువు కూడా ముగిశాక అప్పుడు పరువు నష్టం కేసుకు వెళతారు. కాని ఇప్పుడు సుప్రీం తీర్పు వల్ల ఎవరైనా వెంటనే పరువునష్టం కేసులు వేసిబెదిరించవచ్చు. వ్యక్తులే గాక సంస్థలు పార్టీలు కూడా పరువు నష్టం కేసు వేయొచ్చని అనుమతించడం వల్ల ఇదో పెద్ద సమస్యగానే మారుతుంది. అయితే పరువునష్టం కేసుల వల్ల వ్యక్తిగత భావ ప్రకటనాస్వేచ్చకు ప్రాథమిక హక్కులకు పెద్దగా భంగం కలిగేదేమీ వుండదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించింది.
మహాత్మా గాంధీ హత్యకేసులో ఆరెస్సెస్‌పై ఆరోపఱలు చేసినందుకు కాంగ్రెస్ ఉపాద్యక్షుడు రాహుల్‌గాంధీపైన,, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై ఆరోపణలకు గాను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పైన, తమిళనాడు ముఖ్యమంత్రిపై ఆరోపణలకు గాను సుబ్రహ్మణ్యస్వామిపైన పరువు నష్టం కేసులు నడుస్తున్నాయి.ఈ చట్టం చెల్లుబాటును వారు వేరు వేరు కేసుల్లో సవాలు చేశారు.రాజ్యాంగం 19,అధికరణాల్లోని భావ ప్రకటనా స్వేచ్చకు ఇది భంగకరమని వాదించారు. అనేక దేశాల్లో ఈ కేసులను సివిల్ దావాలుగా పరిగణిస్తున్నారని మన దేశంలో క్రిమినల్ కేసులుగా చూడటం జరికాదని వారు చేసిన వాదనను దీపక్ మిశ్రా, పి.సి.పంత్‌లతో కూడిన దర్మాసనం తోసిపుచ్చింది. సెక్షన్ 21 ప్రకారం వ్యక్తుల ప్రాణరక్షణ హక్కు వుంటుందని, పరువు ప్రతిష్టలకు భంగం కలిగినా ఆ కోవలోకే వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది..
పై ముగ్గురితో పాటు అనేక మీడియా సంస్థలు కూడా ఈ కేసులో వాదనలు చేశాయి.ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో మీడియా స్వేచ్చకు కూడా భంగం కలగవచ్చని భావిస్తున్నారు. . గతంలో రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్,ఎంజిఆర్, ఫరూక్ అబ్దుల్లా వంటివారు పరువు నష్టం పేరుతోనే మీడియా హక్కులపై దాడి చేసే బిల్లులు తెచ్చి వెనక్కు తగ్గారు. ఇప్పుడు కోర్టు స్వయానా ఆ చట్టానికి ఆమోదం తెల్పడంతో ఎలాటి విమర్శనా పరిశోధనాత్మక కథనాలు అవినీతి కుంభకోణాలు బయిటపెడితే తమ ప్రతిష్టకు భంగం కలిగిందని సంబంధిత వ్యక్తులు కోర్టులకు వెళ్లడానికి దీనివల్ల అవకాశం పెరుగుతుంది