ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ విభజనానంతర రాష్ట్రంలో రాజకీయ వివాదాలను విభజనవైపే మరల్చుతున్నారు. అధికారంలోకి వస్తే జిల్లాల సంఖ్య పెంచుతానని ఆయన అన్న మాట నిజమే కాని ఎలాటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా 14 జిల్లాలు పెంచుతున్నట్టు సమాచారం విడుదల చేశారు. అనధికారికంగా ఏఏ జిల్లాలు ఎన్ని కాబోతున్నాయో, ఏఏ మండలాలు ఎటుకలుస్తాయో కూడా లీక్ చేశారు. అంతేగాక జూన్2న తెలంగాణ అవతరణ ద్వితీయ వార్షికోత్సవంలోనే ఈ ప్రకటన చేయబోతున్నట్టు కూడా సూచించారు. ఇప్పుడు ఎక్కడికక్కడ మాకు ప్రత్యేక జిల్లా కావాలనీ,మమ్ముల్ను ఫలానా చోట కలపాలనీ కలపొద్దనీ వివాదాలు ఉద్యమాలు బయిలుదేరుతున్నాయి. మిగిలిన మీడియా సంస్థలకు ఉద్దేశాలు ఆపాదించేవారేమో గాని ఈ ప్రభుత్వం గౌరవంగా ప్రస్తావించే హిందూ పత్రిక ముఖ్యమంత్రి స్వంత జిల్లా కరీంనగర్లోనే ఎంతగా కల్లోలం బయిలుదేరిందో సవివరమైన కథనం ఇచ్చింది.టిఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని ఆ కథనం సారాంశం.జగిత్యాల, మంచిర్యాల,భూపాల్పల్లి,సిద్దిపేట జిల్లాల ఏర్పాటు వల్ల తెలంగాణ ధాన్యాగారమైన కరీంనగర్ జిల్లా అన్నివిధాల నష్టపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సిరిసిల్ల రామగుండం మంధని వాసులు తమను మరో జిల్లాతో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు.. వేముల వాడ రామగుండం జిల్లాఉ వుండాలన్న డిమాండు వుంది. కరీం నగర్ జిల్లాతెలంగాణలో చాలా కీలకమైంది. పివినరసింహారావు, కె.చంద్రశేఖరరావు, సి.నారాయణరెడ్డి, విద్యాసాగరరావులతో సహా ఎందరో ఉద్దండులను అందించిన ఈ జిల్లాలోనే అలజడి మొదలైతే మిగిలిన చోట్ల దాని ప్రభావం వ్యాపిస్తుందనే సంకోచం టిఆర్ఎస్ నేతల్లో వుంది.ఇందుకోసం జెఎసిలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇందులోకాంగ్రెస్ తలదూర్చి మరింత పెంచుతుందనే సందేహాలు కూడా పాలకపార్టీకి వున్నాయి. ఇది పెద్ద సమస్యే కావచ్చు.